విధాత, హైదరాబాద్ :
New Chief Secretary Race | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు పదవీకాలం వచ్చేనెల మార్చితో ముగియనున్నది. దీంతో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ మొదలైంది. సీనియర్ ఐఏఎస్‌లు.. సంజయ్ జాజు, వికాస్ రాజు, సవ్యసాచి ఘోష్, జయేశ్ రంజన్, శశాంక్ గోయల్ ఈ రేసులో ఉన్నట్టు సచివాలయంలో ప్రచారం సాగుతున్నది. రామకృష్ణారావు పదవీకాలం ఏడు నెలల క్రితమే ముగిసింది. అయితే.. ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్రంతో మాట్లాడి.. కొనసాగింపు ఇప్పించారు. ఇప్పుడు ఆ గడువు.. మార్చి నెలాఖరుతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్‌లు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ సచివాలయ అధికారుల్లో నెలకొన్నది.
వాస్తవానికి సీనియర్ అయిన శశాంక్ గోయల్ (1990 బ్యాచ్) ముందు వరుసలో ఉండాలి. కానీ ఆయన ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తరువాతి స్థానంలో విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ (1991 బ్యాచ్) ఉన్నారు. ఈయన ఫార్ములా ఈ కేసు కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. విచారించి, చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఇటీవలే కేంద్రంలోని డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని ముఖ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన పట్ల ఏమాత్రం సుముఖంగా లేరనే ప్రచారం ఉంది. ఇక ఆ తరువాతి వరుసలో మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ (1992 బ్యాచ్) తన వంతు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. వాస్తవానికి ఏడు నెలల క్రితమే తన స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ విజయవంతం కాలేకపోయారు. నూతన ప్రధాన కార్యదర్శిగా ఆయనే నియమితులు అవుతారనే ప్రచారం అప్పుడు జరిగినప్పటికీ, రామకృష్ణారావు పదవీ కాలం ఏడు నెలలు కేంద్రం పొడిగించడంతో వీలు కాలేదు.
తాజా ప్రయత్నాల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు, కర్ణాటకలోని కీలక నాయకుడి మద్దతును జయేశ్ రంజన్ పొందినట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మించి, ఆ స్థాయిలో పెట్టుబడులు రప్పించడంలో విఫలమయ్యారన్న వాదన ఉంది. పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆగ్రహించిన రేవంత్ రెడ్డి ఆయనను సీఎం కార్యాలయం నుంచి తప్పించి మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారని సచివాలయ ఉద్యోగులే చెబుతున్నారు. ఒకరిద్దరు మంత్రులు కూడా జయేశ్ రంజన్ వైఖరిపై ఫిర్యాదు చేశారనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జయేశ్ నియామకానికి రేవంత్ మొగ్గు చూపుతారా? కొత్తవారిని నియమించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజు (1992 బ్యాచ్) కూడా రంగంలోకి దిగారనే ప్రచారం వినిపిస్తున్నది. కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంసీహెచ్ కమిషనర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పెద్దల నుంచి సిఫారసు చేయించుకుని పదవిని దక్కించుకున్నారని అప్పట్లో బల్దియా ఉద్యోగులు చర్చించుకున్నారు. ఢిల్లీ పెద్దల ప్రసన్నం లభిస్తే సంజయ్ జాజు నూతన కార్యదర్శిగా నియమితులు అయ్యే అవకాశాన్ని కొట్టివేయలేమని అంటున్నారు.
రాష్ట్ర ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (1992 బ్యాచ్) కూడా రేసులో ఉన్నప్పటికీ, పదవి ఇస్తే తీసుకుంటారు తప్పితే పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈయనకు అనుకూల అంశాలు ఉన్నప్పటికీ అంతగా ప్రయత్నించడం లేదని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ ఈయనకు అవకాశం ఇస్తే, దళిత అధికారికి ఉన్నత పదవి ఇచ్చారనే పేరును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.
సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ (1994 బ్యాచ్) కూడా తనవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఈయనకు కూడా వివాదరహితుడు. అందరితో సత్సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. అయితే ప్రధాన పోటీ జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ మధ్యనే జరుగుతున్నదని సచివాలయ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి వచ్చే నెలాఖరులోపు ఆదేశాలు అందే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
హర్యానాలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు పదవీ విరమణ చేసిన తరువాత ఏడాది పాటు పొడిగించడం ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. తెలంగాణ లో కూడా రామకృష్ణారావుకు ఆరు నెలల బదులు ఏడు నెలల పాటు పొడిగింపు ఇచ్చారు. మరో ఐదు నెలలు పొడగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే కేంద్రానికి లేఖ పంపించారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో విశేష అనుభవం ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారంటున్నారు. రాష్ట్ర ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉండటం, వడ్డీల భారం అధికంగా ఉండటంతో ఈయన సేవలు మరో ఐదు నెలలు ఉపయోగించుకోవాలనే యోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఒక వేళ పొడిగించని పక్షంలో రిటైర్ అయిన తరువాత ఆర్థిక సలహాదారుగా నియమించుకోవచ్చంటున్నారు.
Read Also |
Trump UFO files release| ఏలియన్స్ సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్ షాకింగ్ ప్రకటన
Garbage Girl | నేను చెత్తను ఎంచుకోలేదు.. అదే నన్ను ఎంచుకుంది.. ఇండియన్ గార్బేజ్ గర్ల్ స్ఫూర్తిదాయకమైన కథ
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తారు?.. దీని వెనుక ఇంత స్టోరీ ఉందా!
