Garbage Girl | నేను చెత్తను ఎంచుకోలేదు.. అదే నన్ను ఎంచుకుంది.. ఇండియన్ గార్బేజ్ గర్ల్ స్ఫూర్తిదాయకమైన కథ
ఇండియన్ గార్బేజ్ గర్ల్ (Garbage Girl) స్ఫూర్తిదాయకమైన కథ గురించి తెలుసా.. 2008లో పర్యాటకురాలిగా భారత్‌కు వచ్చిన ఆమె.. ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి చలించిపోయారు. 'వేస్ట్ వారియర్స్' (Waste Warriors) అనే సంస్థను స్థాపించి నగరాలను శుభ్ర పరుస్తున్నారు. ఆమే జోడీ అండర్‌హిల్ (Jodie Underhill).
Garbage Girl | మనుషులందరూ ఒకేలా ఉండరు. కొందరు తమ కోసం తాము జీవిస్తే, మరికొందరు ఈ ప్రపంచం కోసం జీవిస్తుంటారు. సంతోషకరమైన, పరిశుభ్రమైన నగరం కోసం పాటుపడుతుంటారు. అలాంటి వారిలో జోడీ అండర్‌హిల్ (Jodie Underhill) మొదటి స్థానంలో ఉంటుంది.
జోడీ అండర్‌హిల్ (Jodie Underhill) ఒక బ్రిటిష్ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త. 1976లో ఇంగ్లాండ్‌లోని గ్రేట్ యార్మౌత్‌లో జన్మించారు. 2008లో పర్యాటకురాలిగా భారత్‌కు వచ్చిన ఆమె.. ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి చలించిపోయారు. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్తను, అస్తవ్యస్తమైన వ్యర్థాల నిర్వహణను చూసి ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పుడే నిర్ణయించుకున్నారు.. భారతదేశాన్ని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జోడీ దేశంలోని పలు నగరాల్లో పర్యటించారు. ముంబై, గోవా, కేరళ, కన్యాకుమారి సహా అనేక రాష్ట్రాలు, నగరాలను సందర్శించింది. 2009లో ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని మెక్లియోడ్ గంజ్ (McLeod Ganj)లో “మౌంటైన్ క్లీనర్స్” అనే పేరుతో ఒక చిన్న సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత 2012లో ‘వేస్ట్ వారియర్స్’ (Waste Warriors) అనే ఒక రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ డెహ్రాడూన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది.
ఆమె సంస్థ ప్రధానంగా డెహ్రాడూన్, ధర్మశాల, కార్బెట్ నేషనల్ పార్క్ వంటి ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణ, నిర్వహణ పనులను చేపడుతోంది. హిమాలయాల వంటి సున్నితమైన పర్యావరణ ప్రాంతాల్లో టన్నుల కొద్దీ చెత్తను సేకరించి, వాటిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపడం ద్వారా పర్వతాల సహజ సౌందర్యాన్ని కాపాడుతున్నారు. అంతేకాదు పర్యావరణంపై స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. చెత్తను పారవేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వారిలో పర్యావరణ స్పృహను కలిగిస్తున్నారు.
జోడీ నుంచి గార్బేజ్ గర్ల్..
స్థానికులు ఆమెను గార్బేజ్ గర్ల్ (Garbage Girl) అని పిలుస్తారు. ఎందుకంటే.. సాధారణంగా ప్రజలు చెత్తను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది జోడీ స్వయంగా రోడ్లపైకి వచ్చి మురికి కాల్వల్లోకి దిగి చేతులతో చెత్తను తీస్తుంటారు. ఆ దృశ్యాలను చూసి స్థానికులు సైతం ఆశ్చర్యపోయేవారు. ఆమె అంకితభావాన్ని చూసి స్థానికులు ఆమెను ప్రేమగా గార్బేజ్ గర్ల్ (Garbage Girl of India) అని పిలవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆమె గార్బేజ్ గర్ల్‌గానే గుర్తింపు పొందారు.
“మనం మార్పును కోరుకుంటే.. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి” అని ఆమె బలంగా నమ్ముతారు. కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటేనే దేశం శుభ్రంగా ఉంటుందని అందరికీ శుభ్రతపై స్ఫూర్తి నింపుతుంటారు. “నేను చెత్తను ఎంచుకోలేదు. అదే నన్ను ఎంచుకుంది” అంటూ ప్రపంచానికి చాటి చెబుతుంటారు.
జోడీ సేవలకు గుర్తుగా కొన్ని సంస్థలు ఆమెను పలు అవార్డులతో సత్కరించాయి. ‘బ్రాండ్ ఐకాన్ అవార్డు’, ‘గ్రీన్ హీరో అవార్డు’, ‘అమేజింగ్ ఇండియన్స్ అవార్డు’ వంటి అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. ఒక విదేశీ మహిళ మన దేశానికి వచ్చి, ఇక్కడి చెత్తను చూసి అసహ్యించుకోకుండా, దానిని శుభ్రం చేయాలని నిర్ణయించుకోవడం మనందరికీ ఒక గుణపాఠం. జోడీ అండర్‌హిల్ మనకు నేర్పిన పాఠం ఒక్కటే .. ‘పరిశుభ్రత అనేది ఎవరో చేసే పని కాదు, అది మన బాధ్యత” అని. మనం కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ జోడీ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. ఇదీ జోడీ అండర్‌హిల్ స్ఫూర్తిదాయకమైన కథ.
ఇవి కూడా చదవండి :
Vijay – Rashmika | ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మిక పెళ్లి .. హల్దీ, సంగీత్, రిసెప్షన్ వివరాలు ఇవే
Trump UFO files release| ఏలియన్స్ సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్ షాకింగ్ ప్రకటన
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram