Europe’s Pre-Christian Winter Festivals : క్రిస్మస్ ముందు..భయపెట్టనున్న క్రాంపస్ పరేడ్ లు

క్రిస్మస్ పండగ ముందు యూరప్ దేశాల్లో క్రాంపస్ పరేడ్ ల సందడి. రాక్షస దుస్తుల్లో వీధుల్లో భయపెట్టే ప్రదర్శకులు, పాత జానపద సంప్రదాయం.

Krampus Parades

విధాత : క్రిస్మస్ పండగ వేడుకలు దగ్గర పడుతున్న క్రమంలో విదేశాలలో క్రాపంస్ పరేడ్ లు భయపెడుతున్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ, స్లోవేనియా, ఐరోపా, ఆల్పైన్ ప్రాంతాలలో సాంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్న క్రాంపుస్లాఫ్ లేదా క్రాంపస్ పరేడ్(దెయ్యాల ఆగమన ఆచారం)ల సందడి కొనసాగుతుంది. క్రాంపస్ పరేడ్ లో ప్రదర్శకులు మేక శరీరంతో కూడిన కొమ్ములు, వెంట్రుకల ఆకారాలతో రాక్షసుల మాదిరిగా దుస్తులు ధరించి పరేడ్ లలో పాల్గొంటారు.సెయింట్ నికోలస్ యొక్క దుష్ట ప్రతిరూపంగా క్రాంపస్ ను చెబుతారు. శాంటా చెడ్డ కవలగా కూడా భావిస్తుంటారు. సెయింట్ నికోలస్ మంచిగా ప్రవర్తించే పిల్లలకు బహుమతులు ఇస్తుండగా, క్రాంపస్ అల్లరి జాబితాలో ఉన్నవారికి శిక్ష విధిస్తాడు.

యూరోపియన్ పురాణాల ప్రకారం క్రాంపస్ డిసెంబర్ 5 రాత్రి వీధుల్లో తిరుగుతూ, చెడుగా ప్రవర్తించే పిల్లలను బంధించి బిర్చ్ కొమ్మలతో కొట్టడం చేస్తాడు. ఈ సంప్రదాయం సెలవుల కాలంలో పిల్లలను అదుపులో ఉంచడానికి, వారిలో పాపభీతి పెంచడానికి, డిసెంబర్ 6న సెయింట్ నికోలస్ దినోత్సవం ముందు వారు ఉత్తమంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఉద్దేశించబడిందని కథనం. క్రాంపస్ అనేది మధ్య, తూర్పు ఐరోపా జానపద కథలలోని పౌరాణిక పాత్ర అని..అతనికి జర్మన్ పదం “క్రాంపన్” నుండి ఉద్భవించిన పేరు స్థిరపడిందని..దీని అర్థం పంజా అని చెబుతారు. అందుకే రాక్షస ఆకారంలో ఉంటాడని కథనం. పాతాళలోకానికి చెందిన నార్స్ దేవత హెల్ కుమారుడు క్రాంపస్ అని నమ్ముతుంటారు.

క్రాంపస్ ప్రదర్శకులు భారీ గణగణ శబ్దాలతో సాగుతూ వీక్షకులకు సాంప్రదాయ పద్దతిలో కొడుతు సాగుతారు. కవాతులో మండుతున్న వాహనాలను సైతం నడుపుతారు. క్రాంపస్ ప్రదర్శనలను స్థానిక క్రాంపస్ క్లబ్‌లు నిర్వహిస్తాయి. ప్రదర్శన సమయంలో క్రాంపస్ క్లబ్‌ల సభ్యులు పట్టణ కేంద్రాల గుండా కవాతు చేస్తారు. చూపరులను భయపెడతారు. అప్పుడప్పుడు ప్రేక్షకులను వారిని కర్రలతో కొట్టడానికి జనం నుండి లాగివేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రదర్శకుల అతి కారణంగా ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. దీంతో క్రాంపస్ పరేడ్ కు అక్కడి ప్రభుత్వాలు పక్కాగా నిబంధనలు అమలు చేస్తున్నాయి.