MEIL Group Company | సీఆర్‌పీఎఫ్‌కు CSR-338 రైఫిల్స్ సరఫరా చేయనున్న ఐకామ్–కారకాల్

ఐకామ్–కారకాల్ CSR-338 స్నైపర్ రైఫిల్స్‌ను ఈ ఏడాది చివరికి CRPF కు సరఫరా చేస్తాయి, భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యం బలోపేతం.

meil-group-firm-icomm-with-uae-based-caracal-to-supply-csr-338-rifles-to-crpf

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విధాత): కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు, హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200 CSR-338 స్నైపర్ రైఫిల్స్ ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి సరఫరా పూర్తి కానుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ –ఐకామ్ –కారకాల్ మధ్య ఒప్పందం కుదిరింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్‌‌తో ఐకామ్ సంస్థ సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్–యూఏఈ రక్షణ భాగస్వామ్యంతో భాగంగా, కారకాల్‌తో కలిసి ఐకామ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఆధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్కడే ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేసి సీఆర్‌పీఎఫ్‌కు అందజేయనున్నారు. అదనంగా, కారకాల్ ఇక్కడ తయారైన విస్తృత శ్రేణి ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనుంది.

CSR-338 స్నైపర్ రైఫిల్స్ లాపువా మాగ్నమ్ కాలిబర్‌తో, హై-పర్ఫార్మెన్స్ బోల్ట్-యాక్షన్ కలిగి ఉంటాయి. వీటిలో 27 అంగుళాల బ్యారెల్, 10 రౌండ్ల మ్యాగజైన్, ఇరువైపులా ఉపయోగించగలిగే మ్యాగజైన్ రిలీజ్ & సేఫ్టీ మెకానిజం, రెండు దశల అడ్జస్టబుల్ ప్రిసిషన్ ట్రిగ్గర్, నాలుగు స్థాయిలలో సర్దుబాటు చేసుకునే టెలిస్కోప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ సందర్భంగా కారకాల్ సీఈఓ హమాద్ అలామెరి మాట్లాడుతూ – “ఐకామ్–కారకాల్ స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్ ప్రారంభం తర్వాత, మా భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’ పథకానికి మేము కట్టుబడి ఉన్నామని మరోసారి నిరూపిస్తున్నాం. చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీలో ఇది చారిత్రాత్మక ఘట్టం. భారత భద్రతా అవసరాలకు, పెరుగుతున్న రక్షణ పరిశ్రమకు మద్దతుగా భారత్–యూఏఈ రక్షణ సహకారం ఎంత బలంగా ఉందో దీని ద్వారా స్పష్టమవుతోంది” అన్నారు.

అలాగే ఐకామ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు మాట్లాడుతూ – “సీఆర్‌పీఎఫ్‌తో ఒప్పందం మా సంస్థకు గర్వకారణం. భారత్‌లో స్వయం రక్షణ సామర్థ్యాల అభివృద్ధి కోసం మా దీర్ఘకాల వ్యూహానికి ఇది గొప్ప గుర్తింపు. కారకాల్, ఎడ్జ్‌తో కలిసి మేము కేవలం ఆధునిక CSR-338 స్నైపర్ రైఫిల్స్‌ను సరఫరా చేయడమే కాదు, ప్రపంచ స్థాయి సాంకేతికతను బదిలీ చేస్తున్నాం. హైదరాబాద్‌లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలను సృష్టిస్తూ, భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలు, ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉన్నాం” అన్నారు.