Trump | రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ గట్టి హెచ్చరిక… భారత్ సహకరించకపోతే టారిఫ్‌లు మరింత పెంపు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకవైపు ఆకాశానికి ఎత్తుతూనే మరోవైపు తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చరించ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

Trump |   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలను (టారిఫ్‌లు) ఇంకా పెంచుతామని స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రస్తుతం భారత వస్తువులపై సుమారు 50 శాతం టారిఫ్‌లు కొనసాగుతున్నాయని పేర్కొన్న ట్రంప్, అవసరమైతే ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.ఈ అంశం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పూర్తిగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని మంచి వ్యక్తిగా అభివర్ణించిన ఆయన, అయితే అమెరికా ప్రయోజనాలు తనకు ముఖ్యమని, తనను సంతోషపెట్టడం భారత్‌కు అవసరమని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

పెంచ‌క త‌ప్ప‌దు..

రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగితే మాత్రం సుంకాలు వేగంగా పెంచుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను వైట్ హౌస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా ధృవీకరిస్తూ, రష్యా చమురు వ్యవహారంలో భారత్ నుంచి సహకారం లేకపోతే టారిఫ్‌లు పెంచుతామని ట్రంప్ హెచ్చరించినట్లు పేర్కొంది.ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య ప్రస్తుతం కీలకమైన వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సున్నిత సమయంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా ట్రంప్ రష్యా–భారత్ చమురు ఒప్పందాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

కొన్ని నెలల క్రితం అయితే, ప్రధాని మోదీ తనతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పడం తీవ్ర దుమారానికి దారి తీసింది.భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతుండగా, అమెరికా మాత్రం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా ఒంటరిగా చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత్–అమెరికా సంబంధాల్లో కొత్త ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest News