Site icon vidhaatha

Nepal helicopter crash | నేపాల్‌లో కుప్పకూలిన మరో హెలికాప్టర్‌.. ఐదుగురి మృతి

ఖట్మాండు : నేపాల్‌లో మరో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటు చేసుకున్నది. బుధవారం ఖట్మాండు వాయవ్య ప్రాంతంలోని పర్వత సానువుల్లో హెలికాప్టర్‌ కూలిపోవడంతో నలుగురు చైనీయులు సహా ఐదుగురు చనిపోయారు. శివపురి రూరల్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో ఘటనాస్థలం నుంచి ఐదు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. నేపాల్‌కు చెందిన డైనాస్టీ హెలికాప్టర్‌ 9ఎన్‌ ఏజేడీ ఖట్మాండు నుంచి రాసువా వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.

ఖట్మాండు నుంచి మధ్యాహ్నం 1.54 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్‌.. శ్యాఫ్రుభెన్సీ వెళ్లే మార్గంలో కూలిపోయింది. త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకున్న మూడు నిమిషాలకే సంబంధాలు కోల్పోయిందని నేపాల్‌ పౌర విమానయాన అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో పైలట్‌తోపాటు ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మరో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది.

కొద్ది రోజుల క్రితమే జూలై 24న త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఒక విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 18 మంది చనిపోయారు. విమానం కెప్టెన్‌ ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. తాజా ఘటనతో నేపాల్‌ గగనతల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో అనేక గగనతల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

Exit mobile version