భూమికి 700 కి.మీ. లోతున అపార జలభాండాగారం

  • Publish Date - April 4, 2024 / 06:10 PM IST

వాషింగ్టన్ : భూమిపై జల వనరులు క్రమంగా తరగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ వనరుల కోసం వెదకటం ప్రారంభమైంది. అమెరికాలోని ఇలినాయో రాష్ట్ర భూగర్భ శాస్త్రవేత్తలు భూమిపై నీళ్ళు ఎలా వచ్చాయి? అనే అంశాన్ని ప్రముఖంగా తీసుకుని తమ శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించారు. వారు మెట్టు మెట్టుగా పురోగమిస్తూ పరిశోధనలకు తోడు ప్రయోగ పరీక్షలను కూడా అనుసంధానించారు. దానితో జరిపిన ఈ ప్రయోగంలో వాళ్లు విజయవంతం అయ్యారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతున ఒక పెద్ద భూగర్భ చట్రంలో జల భాండాగారం ఉన్నట్లు కనుగొన్నారు.

ఈ భాండాగారం మన భూమిపై ఉండే 5 మహా సముద్రాల కన్నా మూడు రెట్లు ఎక్కువేనని సంబంధిత శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నీళ్లు ప్రస్తుతం భూమిపై వున్న జల రూపంలో కాకుండా వివిధ రకాల ఖనిజాల మిశ్రమాలతో కూడిన నీటి భాండాగారమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి భూభౌతిక ప్రయోగాల ద్వారా ఈ నీటి భాండాగారాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

భూమిపై నీటి కరువు రోజురోజుకు తీవ్రమవుతున్న సమయంలో నీటికి సంబంధించిన ఈ భాండాగారం బయటపడటం ప్రపంచ శాస్త్రవేత్తలను కొత్త ఆలోచనలకు పురికొల్పుతున్నది. ఈ డిస్కవరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగామారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. నీటి భాండాగారాన్ని కనుగొని అందరి దృష్టినీ ఆ కనుగొన్న అమెరికా ఇలినాయో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు ప్రపంచ నలుమూలల నుండి అందుతున్నాయి.

Latest News