చిన్నారి స్ప్రింగా… రబ్బర్ పిల్లనా..!?

విధాత: ఆ చిన్నారి బాలిక వయసు తొమ్మిదేళ్లు..కాని షావోలిన్ కుంగ్ ఫూ పోటీలో ఆ బాలికే ప్రపంచ విజేత. మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్ లీనే తలదన్నేలా చిన్నారి సాహసోపేత విన్యాసాలు..పోరాటాలు చూస్తే ఆమె ఒంట్లో అసలు ఎముకలు ఉన్నాయా అన్న సందేహం కలగమానదు. ఆ చిన్నారి పేరు జాంగ్ సిక్సువాన్‌. తొమ్మిదేళ్ల వయసులోనే 2024 ప్రపంచ షావోలిన్ కుంగ్ ఫూ పోటీ విజేతగా నిలిచి ప్రపంచాన్ని తన గురించి మాట్లాడుకునేలా చేసిన బాల యోధురాలు. ఈ చిన్నారి ప్రదర్శన చేసిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందులో ఈ చిన్నారి తన బాడీని రబ్బర్​లా వంచుతూ అవలీలగా విన్యాసాలు చేసింది. అది చూసిన మాస్టర్లంతా ఆశ్చర్యపోయారు. బ్రూస్ లీని తలదన్నేలా కుంగ్ ఫూ యుద్ద విద్యలో జాంగ్ సిక్సువాన్‌ తను వెరీ స్పెషల్ అని..నయా బ్రూస్ లీ అని అనిపించుకుంటున్నది.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఇంటర్నేషనల్ గ్రూప్ ఏటా ప్రపంచ షావోలిన్ కుంగ్​ ఫూ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తుంది. గతేడాది ఈ పోటీకి 47దేశాల నుంచి 124మంది మాస్టర్లు హాజరయ్యారు. అందులో భాగంగా హెనాన్ ప్రావిన్స్​కు చెందిన జాంగ్​ సిక్సువాన్​ కూడా పాల్గొని తనకంటే పెద్దవారైన మాస్టర్లతో పోటీ పడింది. పోటీలో తాను ప్రపంచ షావోలిన్ గేమ్స్​లో చాలా ఫేమస్ అయిన కుంగ్​ ఫూ మాస్టర్స్​ను ఓడించింది. దీంతో ‘షావోలిన్ కుంగ్​ ఫూ స్టార్’ టైటిల్ చిన్నారి జాంగ్​కు సొంతమైంది. ఇప్పటికి పది మంది మాత్రమే షావోలిన్​ కుంగ్​ ఫూ స్టార్ టైటిల్ సాధించగలిగారు. ఆ లిస్ట్​లో జాంగ్​ సిక్సువాన్​ కూడా చేరింది. ఇంత చిన్నవయసులోనే జాంగ్​ ఈ టైటిల్ సాధించడం పట్ల ఆమె గురువు జావో జెన్​వు స్పందిస్తూ.. ఆమెకు మార్షల్ ఆర్ట్స్​ అంటే ఎంతో ఇష్టమని, చీకటి పడిన తర్వాత కూడా ప్రాక్టీస్​ చేసేదని చెప్పారు. నాలుగేళ్ల వయసు నుంచే ఆమో ఈ శిక్షణ తీసుకుని నైపుణ్యం సాధించిందని తెలిపారు. ఆమె కఠోర శ్రమ..శిక్షణ..తపన జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని సాధించాలనుకునేవారికి స్ఫూర్తిదాయకమన్నారు.