విధాత: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల మధ్య భారీగా పెరుగుతూ వెలుతున్న వెండి, బంగారం ధరలు సంక్రాంతి వేళ కనుమ పర్వదినం శుక్రవారం మాత్రం తగ్గుముఖం పట్టాయి. వెండి ధర వారం రోజుల తర్వాత కిందకు దిగింది. కిలో వెండి ధర రూ.4000 తగ్గి రూ 3,06,000వద్ద కొనసాగుతుంది. జనవరి 10వ తేదీన కిలో వెండి ధర రూ. 2,75,000గా ఉండటం గమనార్హం. జనవరి 15న వెండి కిలో ధర రూ.3,10,000కు చేరడం ద్వారా ఆల్ టైమ్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. వెండి ధరలు ప్రస్తుతానికి తగ్గినప్పటికి అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక ఒడిదుడుకులు, పారిశ్రామిక డిమాండ్ నేపథ్యంలో మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తగ్గిన పసిడి ధరలు… తాత్కాలికమేనా?
బంగారం ధరలు వరుసగా మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220తగ్గి రూ.1,43,400వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200తగ్గి రూ.1,31,450వద్ద నిలిచింది.
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు త్వరలోనే పుంజుకుంటాయని తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.50లక్షల మైలురాయిని దాటే అవకాశం ఉందని. ఫిబొనాచీ ఎక్స్టెన్షన్స్ వంటి టెక్నికల్ విశ్లేషకులు, అగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా వంటి వారు అభిప్రాయపడ్డారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులు, డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో నెలకొంటున్న అంతర్జాతీయ అస్థిరత, ఇన్వెస్టర్ల లాభార్జన ప్రయత్నాలు వంటి పరిణామాలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమవుతాయని అంచనా వేస్తున్నారు.
