తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై తీవ్ర‌త‌ 7.4 గా న‌మోదు

  • Publish Date - April 3, 2024 / 07:52 AM IST

తైవాన్‌లో బుధ‌వారం ఉద‌యం భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 7.4గా న‌మోదైంది. ద‌క్షిణ తైవాన్‌లోని హులియ‌న్ సిటీ స‌మీపంలో 34.8 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తైవాన్ రాజ‌ధాని తైపీలో ప‌లు బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు పాక్షికంగా దెబ్బ‌తిన్న‌ట్లు తైవాన్ అధికారులు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి న‌ష్టానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. దీని త‌ర్వాత 6.5 తీవ్ర‌త‌తో మ‌రో భూకంపం సంభ‌వించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

తైవాన్‌లో భూకంపం కార‌ణంగా జ‌పాన్‌తో స‌హా మ‌రికొన్ని తీర ప్రాంతాల‌కు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. 25 ఏండ్ల‌లో ఇది అత్యంత బ‌ల‌మైన భూకంపం అని తైపీ సిస్మాల‌జీ సెంట‌ర్ తెలిపింది. తైపీలో భారీ భూకంపం కార‌ణంగా విప‌త్తు అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. భూకంప ధాటికి పాక్షికంగా దెబ్బ‌తిన్న భ‌వ‌నాల నుంచి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. మియాకోజిమా ద్వీపంతో స‌హా జ‌పాన్ దీవుల్లో మూడు మీట‌ర్ల ఎత్తులో సునామీ అల‌లు ఎగిసిపేడ అవ‌కాశం ఉంద‌ని వాతావ‌రణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాబ‌ట్టి తీర ప్రాంతాల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయాల‌ని ఆదేశించారు. ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని సూచించింది.

1999 సెప్టెంబ‌ర్‌లో 7.6 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింద‌ని తైవాన్ తెలిపింది. ఆ భూకంప తీవ్ర‌త‌కు 2,400 మంది ప్రాణాలు కోల్పోయార‌ని గుర్తు చేసింది. 5 వేల భ‌వ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. ఆ భారీ భూకంపం త‌ర్వాత.. ఆ స్థాయిలో భూకంపం సంభ‌వించ‌డం ఇదే తొలిసారి అని పేర్కొంది. తైవాన్‌లో భూకంపాలు రావ‌డం సాధార‌ణ‌మైపోయింది. ఎందుకంటే టేక్టోనిక్ ప్లేట్ల జంక్ష‌న్‌కు స‌మీపంలో ఉన్నందున త‌రచూ భూకంపాలు సంభ‌విస్తాయి. ఇక జపాన్‌లో ప్ర‌తి ఏదాడి 1500 దాకా భూకంపాలు వ‌స్తాయి. జపాన్ ఈశాన్య తీరంలో మార్చి 2011లో 9.0-తీవ్రతతో కూడిన భూకంపం సంభ‌వించింది. ఈ భారీ భూకంపం సునామీకి కార‌ణ‌మైంది. దీంతో 18,500 మంది మ‌ర‌ణించారు. చాలా మంది త‌ప్పిపోయారు.

Latest News