సురక్షితమైన వాతావరణం కూడా మానవహక్కే

  • Publish Date - April 12, 2024 / 10:44 PM IST

స్ట్రాస్ బర్గ్ : వాతావ‌ర‌ణ కాలుష్యంపై హూమ‌న్ రైట్స్ కోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. స్విట్జ‌ర్‌ల్యాండ్‌కు చెందిన మ‌హిళ‌లు అన్నేమహిరర్, రోస్మారీ వైడ్లర్ లు వాతావ‌ర‌ణ కాలుష్యంపై అనేక ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క్షీణిస్తున్న వాతావరణం మూలంగా మృత్యువాత ప‌డుతున్నామ‌ని, దీని నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పించాల‌ని స్విట్జ‌ర్‌ల్యాండ్ ప్ర‌భుత్వంపై పోరాటం చేశారు. అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో యూరోపియ‌న్ కోర్టును ఆశ్ర‌యించారు. స్విట్జర్ ల్యాండ్ ప్ర‌భుత్వం వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం వల్ల ప్ర‌జ‌ల‌కు కలిగే నష్టాల గురించి పట్టించుకోవటం లేదని చేసిన ఆరోపణలను కోర్టు అత్యంత విలువైన‌ విషయాలుగా భావించి సురక్షితమైన వాతావరణం కలిగివుండటం కూడా మానవ హక్కుల కింద‌నే పరిగణించాల‌ని, దానిని క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల క‌ర్త‌వ్య‌మ‌ని తెలిపింది. ఈ తీర్పు ప‌ట్ల ప్ర‌పంచంలోని వాతావ‌ర‌ణ ప్రేమికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఈ విష‌యంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హై కమిషనర్ మేరీ రాబిన్షన్ స్పందిస్తూ.. ఈ తీర్పు క్షీణిస్తున్న వాతావరణ మార్పులను అరికట్టడంలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తుందని త‌న‌ అభిప్రాయాన్ని తెలియజేశారు. యూరప్ కు చెందిన చాలా దేశాల్లో క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులు యూరప్ కంతటికి ప్రమాదకరంగా తయారయ్యాయి. యూరప్ లోని ప్రభుత్వాలు అక్కడి ప్రజల్ని, వాళ్ల మానవ హక్కుల్ని రక్షించటంలో విఫలమవుతున్నాయన్నారు. ఏ దేశాలయితే అక్కడి ప్రజల్ని రక్షించడంలో విఫలమైతాయో ఆ ప్రభుత్వాలు అక్కడి ప్రజల మానవ హక్కుల్ని రక్షించడంలో కూడా విఫలమైనట్లే ఇది పూర్తిగా వాతావరణ మార్పులకు సంబంధించిన న్యాయమన్నారు. అలాగే దీన్ని అన్ని దేశాలు గుర్తించాలని ఆమె కోరారు. యూరోపియన్ కోర్టు తీర్పు ప్రపంచానికే అత్యంత విలువైన తీర్పు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి బంగారు కానుక లాంటిదన్నారు.

Latest News