విధాత: చిన్న చిన్న వాటిల్లోనే ప్రకృతి అందం అంతా ఉంటుందని ఊరికే అనలేదు. నికాన్ స్మాల్ వరల్డ్ 2023 ఫొటో మైక్రోగ్రఫీ (Nikon Photomicrography) అవార్డులకు వచ్చిన ఫొటోలను చూస్తే అది నిజమేనని అనిపించక మానదు. ముఖ్యంగా ఈ పోటీలో తొలి స్థానం దక్కించుకున్న ఎలుక కన్ను ఫొటో సృష్టిలోని అందాన్ని అంతా చూపిస్తోంది. కాన్‌ఫోకల్ మైక్రోస్కోప్‌తో ఎలక కన్నును కొన్ని వందల చిత్రాలు తీసి..వాటిని గుదిగుచ్చి ఒక తుది చిత్రాన్ని రూపొందించారు. ఆస్ట్రేలియాలోని లయన్స్ ఐ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఫర్ ఆప్తల్‌మాలజీ, విజువల్ సైన్స్ లో న్యూరో సైంటిస్ట్‌గా ఉన్న హస్సానియన్ కంబారీ ఈ ఫొటోను తీశారు.
అందులోని వివిధ భాగాలు స్పష్టంగా కనిపించేలా కృత్రిమ మేధ సాయంతో పలు రంగులు వేయడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మధ్యలో కనిపిస్తున్న నల్లని వలయమే రెటీనా. కన్నులో ఉండే రక్త కణాలు ముడుచుకునేందుకు సాయపడే ప్రొటీన్ పదార్థాన్ని ఎరుపు రంగులోను, సెల్ న్యూక్లిని నీలం రంగులోనూ చూపించారు. హై బ్లడ్ షుగర్ వల్ల రెటీనాపై పడే దుష్ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ ఫొటో బాగా ఉపయోగపడుతుందని కంబారీ వివరించారు.
అయితే.. చాలా మంది పేషెంట్లు తమ దగ్గరకి వచ్చేటప్పటికే వారి రెటీనా పూర్తిగా పాడైపోయి ఉంటోందని.. పరిశోధనలు చేయడం ద్వారా వ్యాధి ముదరకుండానే గుర్తించగలిగితే రెటీనాను కాపాడవచ్చని ఆయన అన్నారు. ఈ పోటీకి మొత్తం 86 ఫొటోలు రాగా విజేతలను మంగళవారం ప్రకటించారు. ఎలకలో కండరాలు పెరగడానికి ఉపకరించే కణజాలాన్ని ఫిజియాలజిస్ట్ వైభవ్ దేశ్‌ముఖ్ ఫొటో తీశారు.
అలాగే పొద్దుతిరుగుడు పువ్వు పరాగ రేణువులను సూదిపై పెట్టి తీసిన చిత్రమూ మంచి స్పందనను అందుకుంది. జీవితాంతం యవ్వనంలోనే ఉండే ఆక్సోలటీ అనే జీవి ఫొటో కూడా న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఒక వారం వయసు ఉన్న ఆ జీవిని ఎంతో కష్టపడి ఫొటో తీసినట్లు బయాలజిస్టులు ప్రిసిల్లా వియటో బొనిల్లా, బ్రండన్‌లు తెలిపారు. ఇవి కేవలం మెక్సికోలోని రెండు సరస్సుల్లో మాత్రమే కనపడతాయన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫొటో సాధారణ ఫొటో కన్నా 25 రెట్లు జూమ్ చేసినదని వారు పేర్కొన్నారు.