అమెరికా మాజీ ఉప విదేశాంగ మంత్రి కర్ట్ క్యాంప్‌బెల్, భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం దిగుమతి సుంకాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చర్యలు ఇండియా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముందని హెచ్చరించారు. ట్రంప్ భారత దిగుమతులపై అధికంగా టారిఫ్‌లు విధించిన దరిమిలా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణాన్ని చూపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అమెరికన్ రాజకీయ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో CNBC ఇంటర్నేషనల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ట్ క్యాంప్‌బెల్ మాట్లాడుతూ, అమెరికాకు 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైన సంబంధం భారతదేశంతోనేనని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సమయంలోభారత్పై ట్రంప్ చేస్తున్న ఆర్ధిక, రాజకీయ దాడులు ఈ సంబంధాన్ని శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది’’ అని స్పష్టం చేశారు. ట్రంప్ ఇండియా గురించి మాట్లాడిన తీరు, మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వాన్ని సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టేశాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అమెరికా ముందు మోకరిల్లకూడదని హితవు పలికారు.
అయితే ట్రంప్ విధానాలు కేవలం వాణిజ్య ఒప్పందాలకే కాకుండా, భారత–అమెరికా భవిష్యత్తు సహకార పటిమపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయన్నది క్యాంప్‌బెల్ అభిప్రాయం. ముఖ్యంగా టెక్నాలజీ, విద్యా, రక్షణ రంగాల్లో ఇండియా-అమెరికా భాగస్వామ్యం భవిష్యత్తులో అత్యంత కీలకమని తెలిపారు. దీనిపై ఇప్పుడు ఏర్పడిన బేధాభిప్రాయాలు మబ్బులుకమ్మే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు, అమెరికా భారత్‌పై రష్యాతో సంబంధాలను తెంచుకోమని ఒత్తిడి చేయడం విపరీత పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ‘‘ఇది తిరగబడే ప్రమాదముంది. భారత వ్యూహకర్తలు దీనికి పూర్తిగా భిన్నంగా స్పందిస్తారు’’ అన్నారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ మరోసారి వ్యాఖ్యానిస్తూ.. ‘‘భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరగవు, ఇప్పటి వరకు విధించిన సుంకాల అంశం పరిష్కారమైన తర్వాతే ఏదైనా ముందుకు వెళ్లవచ్చు’’ అని తెలిపారు. మరోవైపు, అమెరికా విదేశాంగ శాఖ మాత్రం భారతదేశం తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొంటూ, పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పింది. కానీ వాస్తవికంగా చూస్తే, ఈ పరస్పర వ్యాఖ్యలు, వాణిజ్య తగాదాలతో రెండేళ్లుగా అభివృద్ధి బాటపట్టిన భారత–అమెరికా సుస్థిర సంబంధాలకు ప్రస్తుతం గండి పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Categories: International News, India News