అమెరికాలో కాల్పుల కలకలం..! కాల్పుల్లో 22 మంది దుర్మరణం..! 50 మందికిపైగా గాయాలు..!

  • Publish Date - October 26, 2023 / 04:47 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తూటా పేలింది. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌ నగరంలో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 22 మంది మరణించగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. కాల్పుల తర్వాత నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది. పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రైఫిల్‌తో ఉన్న అనుమానితుడి రెండు ఫోటోలను భద్రతా అధికారులు పోస్ట్‌ చేశారు. నిందితుడి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే.. చెప్పాలని కోరారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని లెవిస్టన్‌లోని మెడికల్‌ సెంటర్‌కు తరలించగా.. చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


సోషల్‌ మీడియా ఎక్స్‌ ద్వారా షూటర్ గురించి మైనే స్టేట్ పోలీసులు హెచ్చరించారు. నివాసితులు ఇండ్లలో తలుపులు లాక్‌ చేసుకొని ఉండాలని.. ఎవరూ వీధుల్లోకి రావొద్దని కోరారు. ఇక ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను విడుదల చేసింది. కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులతో చర్చించినట్లు గవర్నర్​ జానెట్ మిల్స్​ పేర్కొంది. మరోవైపు, కాల్పుల ఘటనపై శ్వేత సౌధం స్పందించింది. అధ్యక్షుడు బైడెన్​కు ఘటనకు సంబంధించి వివరాలను అందించినట్లు చెప్పింది. 2022 మే ఘటన తర్వాత ఇదే అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులతో పాటు ఇద్దరు టీచర్లు సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Latest News