World’s Best Airport | ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టు ఇదే.. టాప్‌-100లో భారత ఎయిర్‌పోర్టులు ఎన్నంటే..!

World's Best Airport : దోహాలోని 'హమద్‌' అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా (Worlds Best Airport 2024) నిలిచింది. సింగపూర్‌కు చెందిన 'ఛాంగి' ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు రెండో స్థానం దక్కించుకుంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను ఈ రెండు ఎయిర్‌పోర్టులే పంచుకుంటున్నాయి.

  • Publish Date - April 19, 2024 / 07:00 AM IST

World’s Best Airport : దోహాలోని ‘హమద్‌’ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా (Worlds Best Airport 2024) నిలిచింది. సింగపూర్‌కు చెందిన ‘ఛాంగి’ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు రెండో స్థానం దక్కించుకుంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను ఈ రెండు ఎయిర్‌పోర్టులే పంచుకుంటున్నాయి. స్కైట్రాక్స్‌ ఏటా విడుదల చేసే ఈ నివేదికలో పోయిన ఏడాది ‘ఛాంగి’ అగ్ర స్థానం అందుకుంది.

ఈ ఏడాది సియోల్‌లోని ‘ఇన్చెయాన్‌’ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టుగానూ ఈ విమానాశ్రయం అవార్డు సొంతం చేసుకుంది. ఇక టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకుంది. కొవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం అందుకు కారణమైంది.

అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం కూడా తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకోలేదు. సియాటెల్‌లోని టకోమా ఎయిర్‌పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమ ర్యాంకు. ఐరోపా ప్రాంతంలో ప్యారిస్‌ చార్లెస్‌ డి గలే, మ్యూనిచ్‌, జ్యూరిక్‌ టాప్‌-10లో చోటు సంపాదించాయి. ఇక ఈ జాబితాలో తొలి 100 ఎయిర్‌పోర్టుల్లో భారత్‌కు చెందినవి నాలుగు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో నిలిచింది. ఇదే భారత్‌లో అత్యుత్తమ విమానాశ్రయం.

ఆ తర్వాత బెంగళూరు ఎయిర్‌పోర్టు 10 స్థానాలు మెరుగుపర్చుకుని 59వ స్థానంలో నిలిచింది. గత ఏడాది బెంగళూరుకు 69వ స్థానం దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నాలుగు స్థానాలు మెరుగుపడి 61వ స్థానానికి చేరింది. గత ఏడాది ఈ ఎయిర్‌పోర్టుకు 65వ స్థానం దక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మాత్రం 9 స్థానాలు వెనుకబడి 95వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఎయిర్‌పోర్టుకు 84వ స్థానం దక్కింది.

ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్టు దక్షిణాసియాలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సిబ్బంది సేవల కేటగిరీలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు దక్షిణాసియాలో అగ్రస్థానం దక్కించుకుంది. అదేవిధంగా దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్టుగా బెంగళూరు నిలిచింది. న్యూయార్క్‌లోని జెఎఫ్‌కే విమానాశ్రయం ఐదు స్థానాలు కోల్పోయి 93వ స్థానానికి పడిపోయింది. లాగార్డియా ఎయిర్‌పోర్టు 57 నుంచి 33వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టు జాబితాలో 19వ స్థానాన్ని నిలబెట్టుకుంది.

లండన్‌లోని హీత్రో విమానాశ్రయం ఒక స్థానం మెరుగుపడి 21కి చేరింది. గాట్విక్‌ ఎయిర్‌పోర్టు ఏడు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన ఒకినావా ఎయిర్‌పోర్టు ఏకంగా 100కు పైగా స్థానాలు మెరుగుపడి 199 నుంచి 91వ స్థానానికి చేరింది. ఇక ప్రపంచంలోని టాప్-20 ఎయిర్‌పోర్టులు కింది జాబితాలో ఉన్నాయి.

టాప్‌-20 ఎయిర్‌పోర్టుల జాబితా

1. హమద్‌ (దోహా), 2. ఛాంగి (సింగపూర్‌), 3. ఇన్చెయాన్‌ (సియోల్‌), 4. హనీదా (టోక్యో), 5. నరీతా (టోక్యో), 6. చార్లెస్‌ డి గలే (పారిస్‌), 7. దుబాయ్‌ (యూఏఈ), 8. మ్యూనిచ్‌ (జర్మనీ), 9. జ్యూరిక్‌ (స్విట్జర్లాండ్‌), 10. ఇస్తాంబుల్‌ (తుర్కియే), 11. హాంకాంగ్‌, 12. ఫ్యూమిసినో (రోమ్‌), 13. వియన్నా (ఆస్ట్రియా), 14. వాంటా (హెల్సింకీ), 15. బరజాస్‌ (మ్యాడ్రిడ్‌), 16. సెంట్రైర్‌ నగోయా (జపాన్‌), 17. వాంకోవర్‌ (కెనడా), 18. కాన్సాయ్‌ (జపాన్‌), 19. మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా), 20. కోపెన్‌ హెగెన్‌ (డెన్మార్క్‌).

Latest News