Zohran Mamdani | అమెరికాలోని కీలక నగరం న్యూయార్క్ మేయర్ పదవిని భారతీయ మూలాలు ఉన్న 33 ఏళ్ల ముస్లిం జొహ్రాన్ ముమ్దానీ చేపట్టనున్నారు. ప్రాథమిక ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థికంటే చాలా ముందు భాగాన దూసుకుపోతున్నారు. జూలై ఒకటిన చేపట్టే తదుపరి ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత కూడా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే.. మమ్దానీపై భారతదేశంలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఐక్యంగా విమర్శలు చేయడం విశేషం. ‘జొహ్రాన్ మమ్దానీ నోరు తెరిచాడంటే.. పాకిస్తాన్ పీఆర్ టీమ్ ఆ రోజుకు సెలవు తీసుకోవచ్చు. న్యూయార్క్ నుంచి కట్టుకథలను అరచి చెప్పే ఇటువంటి మిత్రుడు భారతదేశానికి అవసరం లేదు’ అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ నుంచే కాదు బీజేపీ నుంచి సైతం మమ్దానీకి విమర్శలు ఎదురయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ఎంపీ కంగనా రనౌత్.. మమ్దానీ టార్గెట్ చేసి విమర్శలు కురిపించారు. మమ్దానీ భారతీయుడిగా కంటే.. ఎక్కవగా పాకిస్తానీలా కనిపిస్తాడని ఆరోపించారు. ‘ఆయన తల్లి భారతదేశ ప్రేమాస్పద మీరా నాయర్ మనకున్న ఉత్తమ దర్శకుల్లో ఒకరు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆమె గుజరాత్‌కు చెందిన రచయిత మెహమూద్ మమ్దానీని వివాహం చేసుకున్నారు. వారి కొడుకే జొహ్రాన్.. ఆయన భారతీయుడికంటే పాకిస్తానీగానే ఎక్కువ వినిపిస్తాడు’ అని కంగన పేర్కొన్నారు.