Site icon vidhaatha

encounter in Dantewada । దంతేవాడలో ఎన్‌కౌంటర్‌.. 9 మంది మావోయిస్టుల హతం

encounter in Dantewada । మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దంతేవాడ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. తాజా సమాచారం అందే సరికి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు ధృవీకరించారు. డిస్ట్రక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ (DRG), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌  ఫోర్స్‌ (CRPF) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 9 మంది మావోయిస్టులు (Maoists)  చనిపోయారు. ఘటన జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేషన్‌  (anti-Maoist operation) ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ‘ఇప్పటి వరకూ 9 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిల్‌ (SLR), ఒక .303 రైఫిల్‌, ఒక .315 బోర్‌ రైఫిల్‌ (.315 Bore Rifle) సహా భారీగా ఆయుధాలు లభించాయని  పోలీసులు విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ‘ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ ముగియగానే ఇతర వివరాలు తెలియజేస్తాం’ అని ఆ ప్రకటనలో తెలిపారు.

మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేసిన నేపథ్యంలో గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 2023 డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌ వరకూ 104 ఎదురుకాల్పుల ఘటనల్లో 147మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. 723 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా.. 622 మంది లొంగిపోయారని ప్రభుత్వ డాటా పేర్కొంటున్నది. మావోయిస్టులు బలంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా ఆధారిత ఆపరేషన్ల సమన్వయం కోసం ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌లను  (forward operating bases (FOBs)) తెరిచే పనిని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అదే సమయంలో మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారులకు సహకరించేందుకు ఈ కార్యక్రమాన్ని వేగంగా చేపడుతున్నది.

గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకూ 33 ఫార్వర్డ్‌ ఆపరేటిం బేస్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో నాలుగు, బీజాపూర్‌లో 8, దంతేవాడలో 2, నారాయణ్‌పూర్‌లో 4, కాంకేర్‌, రాజ్‌నందగావ్‌లో ఒక్కోటి చొప్పున నెలకొల్పారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 2013లో  పది రాష్ట్రాల్లోని 126 జిల్లాల్లో ఉంటే.. ఇప్పడు వాటి సంఖ్య 9 రాష్ట్రాల్లోని 38 జిల్లాలకు తగ్గిందని ఇటీవల ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. 2010 నుంచి మావోయిస్టు హింసకు సంబంధించిన ఘటనలు 73 శాతం తగ్గాయని తెలిపింది.

Exit mobile version