Site icon vidhaatha

Agricultural loan waiver । వ్యవసాయ రుణమాఫీకి ఇంకా చిక్కుముడులెన్నో..

Agricultural loan waiver । రుణమాఫీ కావాలంటే వడ్డీ చెల్లించాలని బ్యాంకులు చెపుతున్నాయి. వడ్డీ చెల్లించిన వారికే బ్యాంకులు రుణ మాఫీ (loan waiver) చేస్తున్నాయి. మరోవైపు వివిధ కారణాలతో గ్రామాల్లో మెజార్టీ రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విడుదల చేసిన నివేదికలోనే స్పష్టమైంది. అయితే రుణమాఫీ అయిన రైతుల నుంచి ఆగస్ట్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఎంత వడ్డీ అయిందో తెక్కలు తీసి మరీ వసూలు చేస్తున్నారు. ఈ 8 నెలల కాలానికి వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరీ అమలు చేస్తున్నారని నేరేడుచర్ల మండలానికి చెందిన రైతు బైరెడ్డి రవీందర్ రెడ్డి తెలిపారు. తాను రూ. 46 వేల రుణాన్ని 2022లో కో ఆపరేటివ్ బ్యాంకులోతీసుకున్నానని, అయితే రుణమాఫీ లిస్టులో తన పేరు ఉండటంతో బ్యాంకుకు వెళితే డిసెంబర్ 9వ తేదీ వరకు అసలు, వడ్డీ కలిపి మాఫీ అవుతుందని, అయితే.. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు వడ్డీ (interest) కింద రూ. 4 వేలు చెల్లించాల్సిందేనని చెప్పి వసూలు చేశారని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ వడ్డీకి బ్యాంకులు, వ్యవసాయ శాఖ (agriculture department) అధికారులు చెపుతున్న సమాధానం చాలా విచిత్రంగా ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి కటాఫ్ డేట్ (cut-off date for loan waiver)గా డిసెంబర్ 9వ తేదీ తీసుకున్నారు కాబట్టి, డిసెంబర్ 9వ తేదీ తరువాత నుంచి రుణమాఫీ జరిగే వాటికి వడ్డీ చెల్లించాలని గల్లా పట్టి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సదరు రైతులు వడ్డీ చెల్లించి రుణమాఫీ చేసుకుంటున్నారు. గతంలో బీఆరెస్‌ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది కానీ వడ్డీ చెల్లింపులు చేయించుకోలేదని, కొత్తగా ఇప్పడు ఈ మెలికలేమిటోనని నరసింహారెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

వాస్తవంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో (election campaign) రెండు లక్షల వరకు అసలు, వడ్డీ కలిపి రుణమాఫీ చేస్తామన్నారు. 2023 డిసెంబర్ 9వ తేదీలోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. కుటుంబం యూనిట్‌గా తీసుకుంటామన్నారు. బ్యాంకర్లు మాత్రం డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని చెప్పి అసలు వడ్డీ కలిపి 2 లక్షల లో పు ఉన్న వాటికి కూడా ఈ 8 నెలల వడ్డీ వసూలు చేస్తుండడం గమనార్హం. ఇది బ్యాంకుల అతి తెలివా? లేక ప్రభుత్వమే భారం తప్పించుకోవడానికి దొడ్డి దారిన వడ్డీ వసూలు చేస్తుందా? అన్న సందేహం రైతాంగంలో వ్యక్తమవుతున్నది. రుణమాఫీ జరుగుతున్న తీరుపై యావత్ తెలంగాణ రైతాంగంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రుణమాఫీ అమలుకు అనేక చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. కుటుంబానికి ఒక్క యూనిట్ గా తీసుకొని రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఇప్పటికే మూడు విడతల రుణమాఫీని రేవంత్ సర్కారు ప్రకటించింది. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కేవలం రూ.17,933 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. మాఫీ అయిన ఈ రుణాలన్నింటికి రైతుల నుంచి దాదాపు రూ.150 కోట్ల వరకు వడ్డీ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకుంటే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని రైతులు అంటున్నారు.

రైతులకు రుణమాఫీ అమలు చేయడంలో ఇబ్బందులున్నాయని వాటిని అధిగమిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. ఈ మేరకు ఇంటింటి సర్వే (house-to-house survey) చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి అధికారులు, సిబ్బంది రైతుల ఇంటికి వెళుతున్నట్లు ప్రకటించారు. అలాగే రైతు భరోసా రుణమాఫీ యాప్ ద్వారా రైతురుణమాఫీ ఫిర్యాదులను స్వీకరిస్తామని ప్రభుత్వం ప్ర కటించింది కూడా.. దాదాపు 1.20 లక్షల మంది రైతుల ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నాయని, 1.61 లక్షల రైతుల ఆధార్ కార్డులలో పేరు ఒక తీరుగా, అకౌంట్‌లో మరో తీరుగా ఉన్నట్లు చెప్పారు. 4.43 లక్షల మందికి రేషన్ కార్డులలో తప్పులున్నాయని, 8 లక్షల మంది 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నారని తెలిపారు. దీంతో 2లక్షల రుణం తీసుకున్న రైతులు ఆ పైన చెల్లింపులు చేస్తే మాఫీ చేస్తామని ప్రకటించారు. మరో వైపు కుటుంబానికి యూనిట్ గా తీసుకునే లెక్కల్లో కూడా ఇబ్బందులున్నట్లు అధారులు చెప్పుతున్నారు. రుణమాఫీలో బ్యాంకులు అయిన కాడికి వడ్డీ వసూలు చేయాలని భావిస్తుంటే అధికారులు వివరాల నమోదులో చేసిన తప్పుల కారణంగా సదరు రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో 10 నుంచి 15 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, అది కూడా డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ చేశారని రైతులు చెపుతుండటం గమనార్హం. ఇదే తీరుగా రుణమాఫీ జరిగితే రైతుల మద్దతు ఏమో కానీ రేవంత్ రెడ్డి సర్కారు రైతుల వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Exit mobile version