BRS Releases Chargesheet : రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ పార్టీ 'రెండేళ్ల మొండిచేయి' పేరుతో చార్జ్ షీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన పారదర్శకత లేకుండా పోయిందని ఆయన 'బిల్డప్ బాబాయ్‌'గా తయారయ్యారని విమర్శించారు.

BRS Releases Chargesheet

విధాత, హైదరాబాద్ : రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ చార్జ్ షీట్ విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు చార్జ్ షీట్ విడుదల చేశారు. రెండేళ్ల మొండిచేయి పేరుతో బీఆర్ఎస్ చార్జ్ షిట్ ను హరీష్ రావు విడుదల చేసి మాట్లాడారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్‌ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రైవేట్ లిమిటెడ్ పాలనగా మారిందన్నారు. ప్రజా భవన్‌ పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు.. మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్‌మెంట్లు, విందులు వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఆరోపించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీశారని.. రెండేండ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిందో ఆలోచించాలన్నారు.

బిల్డప్ బాబాయ్ గా రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ గా తయారయ్యాడని.. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నాడని.. ఆ తర్వాత నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారని..చివరకు వాళ్లు కూడా పత్తా లేకుండా పోయారని.. ఆ దరఖాస్తులను పట్టించుకున్న నాథుడే లేడు అని హరీష్ రావు విమర్శించారు. మ్యానిఫెస్టోలోని మొదటి కార్యక్రమం, రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమందని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని హరీష్ రావు వివరించారు.

అవినీతికి మోడల్ సిలబస్ కాంగ్రెస్ పాలన

అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని.. కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే.. తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్‌గా పెట్టొచ్చు అని హరీష్ రావు ఆరోపించారు. రెండేళ్లలో జరిగిన అవినీతి వివరాలను వెల్లడించారు. ఫైనాన్స్‌లో బిల్లు రావాలి అంటే 30 శాతం ఇవ్వాలని, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌, ఉత్తమ్, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకువచ్చారని విమర్శించారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేండ్లలో జర్నలిస్టులకు ఒక్క అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని, జర్నలిస్టుల సంక్షేమాలకు ఒక్క రూపాయి అయినా ఇవ్వలేదని విమర్శించారు.

ఐటీఐకి, ఐఐటీ, ఐఐఐటీకి తేడా కూడా తెలియని మూర్ఖుడు ఈరోజు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడని హరీష్ రావు విమర్శించారు. కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకునేందుకు మహిళలు వారి పిల్లలతో వస్తున్నారని, పెళ్లికి సహాయం చేస్తున్నావా లేక పిల్లల 21వ రోజుకు సహాయం చేస్తున్నావా? అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి ఇవ్వాల్సిన రూ.980 కోట్ల నిధులు పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

Akkineni Nagarjuna : అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం
Sameera Reddy | ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం… కన్యాదానం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

Latest News