విధాత: చత్తీస్ గఢ్( Chhattisgarh encounter) అడవులలో మరోసారి తుపాకులు గర్జించాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఓ వైపు వరుస ఎన్ కౌంటర్లు..మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్ధకమవుతున్నది. 2026మార్చి మాసాంతానికి మావోయిస్టు రహిత భారత్ నిర్మాణం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతున్నది. భద్రతా బలగాలు ఆధునిక టెక్నాలాజీతో అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను వరుస ఎన్ కౌంటర్లలో హతమారుస్తున్నారు.
ఇంకోవైపు అగ్రనేతలు సహా భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ గెరిల్లా దళాల సభ్యులు, నాయకులు మనుగడ కోసం పోరాడుతున్నారు. ఇప్పటిదాక అరెస్టులు, ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో ఈ ఒక్క ఏడాదిలోనే 3,447మందిని మావోయిస్టు పార్టీ కోల్పోవడం గమనార్హం. ఇదే ఏడాదిలో 2,212మంది లొంగిపోవడం విశేషం. ఎన్ కౌంటర్లలో 338 మంది చనిపోగా..957మంది లొంగిపోయారు.
