విధాత: గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని హీరో అల్లు అర్జున్ ఇంటిదగ్గర హై టెన్షన్ నెలకొంది. రేవతి మరణానికి కారణం అల్లు అర్జున్ అని, వారి కుటుంబానికి క్షమాపణలు చెబుతూ.. కోటి రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు ఓయూ JAC నాయకులు నినాదాలు చేశారు, ఇంటిముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఆపై అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ లోపలికి వెళ్లి పూల కుండీలు ధ్వంసం చేశారు. గోడలెక్కి రాళ్ళు, టమాటాలు విసురుతూ విధ్వంసం సృష్టించారు . దీంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి బన్నీ ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ఈ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నా..ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతలందరినీ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.