Cotton farmer | పత్తి రైతు మెడపై తేమ కత్తి..అన్నదాత జీవితాలతో చెలగాటం!

చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయిద్దామంటే తేమ అడ్డంకిగా మారుతోంది. పోనీ, ఏరిన పత్తిని ఆరబెట్టి విక్రయిద్దామంటే సాధారణంగా ఏ రైతు ఇల్లు అంతపెద్దగా ఉండే పరిస్థితి ఉండదూ, కల్లాల్లో ఆరపోద్దామంటే అకాల వర్షాలు, జల్లులు, తేమ వాతావరణంతో అగ్నిపరీక్షగా మారుతోంది.

cci-cotton-procurement-starts-from-october-21-kodandareddy-warns-farmers

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

పత్తి రైతు మెడపై తేమ కత్తి వేలాడుతోంది. కొద్ది రోజులుగా వాతావరణంలో జరుగుతున్న మార్పులు పత్తి పండించిన రైతులను తీవ్రంగా కలవరపరుస్తోంది. పూత, కాత దశ దాటి చేతికొచ్చిన పత్తిని ఏరి మార్కెట్ లో విక్రయించే ఈ సమయంలో అకాల వర్షాలు, చిరు జల్లులు, తుపాన్ ప్రభావం, వాతావరణంలో పొడి తగ్గిపోయి నెలకొన్న తేమ వాతావరణంతో పత్తి ఆరబెట్టలేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే తీరుగా పత్తి వేసిన రైతుల పరిస్థితి మారింది. విత్తనాలు, ఎరువులు ఇతరత్రా పత్తి సాగుకు అవసరమైన ఖర్చులు తడిసి మోపెడవుతుండగా మార్కెట్ లో అమ్మకానికి వచ్చే సరికి అన్ని అడ్డంకులు తలెత్తుతున్నాయి. ఎటూ పాలుపోని పరిస్థితిల్లో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అమ్మబోతే అడివే..

చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయిద్దామంటే తేమ అడ్డంకిగా మారుతోంది. పోనీ, ఏరిన పత్తిని ఆరబెట్టి విక్రయిద్దామంటే సాధారణంగా ఏ రైతు ఇల్లు అంతపెద్దగా ఉండే పరిస్థితి ఉండదూ, కల్లాల్లో ఆరపోద్దామంటే అకాల వర్షాలు, జల్లులు, తేమ వాతావరణంతో అగ్నిపరీక్షగా మారుతోంది. ఈ కారణంగా రైతులు పత్తిని మార్కెట్‌కు తెచ్చి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించే ప్రయత్నం చేస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటున్నందున ధర అమాంతం తగ్గించేస్తున్నారు. తేమ శాతం 12కు మించితే సీసీఐ పత్తిని కొనేందుకు కూడా అంగీకరించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ముందుగానే ఇళ్ళవద్ద దళారులకు విక్రయించడమో? లేదా? మార్కెట్ కు తెచ్చిన తర్వాత దళారులను ఆశ్రయించడమో చేస్తున్నారు. ఇదే అదునుగా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల రైతుల ఆదాయం భారీగా తగ్గుతోంది. దీనికి తోడు తాజాగా సీసీఐ తెచ్చిన నిబంధనలు సగటు రైతును అవస్థలపాలు చేస్తోంది.

రైతులను ఐటి నిపుణులుగా భావిస్తున్నారా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతోందంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తేమ శాతం పెద్ద ఇబ్బందిగా మారి రైతులపాలిట శాపంగా మారినందున ఈ అంశం పై కేంద్రంతో మాట్లాడుతున్నట్లు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. రైతుల దయనీయ స్థితి, కనీస మద్ధతు ధర లభించని తాజా పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చి, తేమ శాతంలో ఏమైనా సడలింపు ఇస్తుందా? లేదా? ధరల్లో కోత లేకుండా సీసీఐ కొనుగోలు చేసే విధంగా మార్పులు చేస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. తాజా చర్చల వల్ల కేంద్రం, సీసీఐ అధికారులు సానుకూలంగా స్పందిస్తారా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

మద్ధతు ధర శుద్ధ అబద్దం!

మద్ధతు ధర ప్రకటించే కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తి క్వింటాల్ కు రూ. రూ.8,110లుగా ప్రకటించింది. ఈ పత్తిలో 8 శాతానికి మించి తేమ శాతం ఉండకూడదని నిబంధన విధించింది. తేమ శాతం ఒకటి పెరిగే కొద్ది క్వింటాల్ కు రూ. 81లు కోత విధిస్తామని స్పష్టం చేశారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,866, 12 శాతం ఉంటే 7,785.60 ధర చెల్లిస్తారు. ఈ తేమ శాతం కూడా 12కు మించితే అసలు కొనుగోలు చేయమంటూ తేల్చిచెప్పారు. దీంతో కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర రూ. 8,110లు కేవలం లాంఛనప్రాయంగా మారింది. తాజా పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలున్నందున మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు.

మద్దతు ధర కంటే దాదాపు క్వింటాల్ కు రూ. 1000 నుంచి రూ.1,500లు ధర తగ్గించి దళారులు దండుకుంటున్నారు. ఇదిలా ఉండగా అకాలవర్షాలు, తేమ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ అన్ని చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రానున్న రోజుల్లో వీటిని ప్రారంభిస్తామంటున్నారు. ప్రస్తుతం ఎనుమాముల లాంటి పెద్ద మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీసీఐ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల ప్రారంభంలో మిగిలిన కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశముందంటున్నారు.

కలిసిరాని ఖరీఫ్..

ఖరీఫ్ సీజన్ మొత్తం పత్తి రైతుల జీవితాలతో వరుణుడు చెలగాటమాడుతున్నారు. ఈసారి పత్తి రైతులకు ఏదీ కలిసిరాలేదు. గతానికి భిన్నంగా ఈ సారి ఖరీఫ్ సీజన్ ముందుగా మురిపించింది. కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు నాటితే మొలకదశకు వచ్చిన పరిస్థితుల్లో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో బిందు సేద్యం చేయాల్సిన రైతులు బిందె సేద్యం చేశారు. ట్యాంకర్లతో నీళ్ళు పోసి మొక్కను చంటిపిల్లల మాదిరిగా సాకారు. ఆ తర్వాత భారీ వర్షాలు, వరుస వానలతో పత్తి చేలు జాలువారిపోయాయి. మొక్క ఎదగకుండా పోయింది. మధ్యలో కారణాలేవైనా సర్కారు సకాలంలో ఎరువులు అందించలేకపోయాయి. ఈ కారణంగా చెంపదెబ్బ, గోడ దెబ్బ రెండు తగిలినట్లు పత్తి పంట పై ప్రభావం చూపాయి. పూత, కాత పై ప్రభావం కనబరిచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి చేతికొస్తుందా? లేదా? అనే ఆందోళనలో రైతులున్నారు.