Former Minister Kodali Nani :
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొడాలి నాని ఆరోగ్యం పట్ల వైసీపీ పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అరెస్టు ప్రచారంతో ఒత్తిడిలో నాని
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై అసభ్య విమర్శలు చేసిన వారిని, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను ఒక్కొక్కరిగా ప్రభుత్వం కేసుల పాలు చేస్తు అరెస్టులు చేస్తుంది. ఈ క్రమంలో తదుపరి కొడాలి నాని వంతు అన్న ప్రచారంతో ఆయన మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలై ఉండవచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ పేరుతో ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను, గన్నవరం టీటీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, చంద్రబాబు, పవన్ లపై అసభ్యకర విమర్శల కేసుల్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు.
తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీపై స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించారన్న అభియోగాలతో కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కూటమి సర్కార్ టార్గెట్ లో ఉన్నారని..ఆయనపై కూడా త్వరలోనే కేసులు నమోదవుతాయన్న ప్రచారం సాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం టార్గెట్ లిస్టులో కొడాలి నాని ప్రధానంగా ఉన్నారని..ఆయన అరెస్టు టార్గెట్ గా పావులు కదుపుతుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్ టో కొంతకాలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులను అవమానించేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారంటూ మచిలీపట్నంలో నాని మీద నమోదైన ఓ పాత కేసును ప్రభుత్వం తైరపైకి తెచ్చింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో పాటు పలు ఇతర వివాదాలకు సంబంధించిన కేసులు ఫైల్ చేసి కొడాలి నానిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒత్తిడికి గురై ఉంటారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.