విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి బంగారం, వెండి ధరలు పడిపోయాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,52,350కి తగ్గింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 1,39,650కి పడిపోయింది. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది.
పడిపోయిన పసిడి ధరలు
గత కొన్ని వారాలుగా పసిడి మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలో జాప్యం అంచనలు, ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా ఉంటాయన్న సంకేతాలతో బంగారం ధరలు ఒత్తిడి ఎదుర్కుంటున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ దిగుబడులు పెరగడం వంటి అంశాలు పసిడి ధరలు క్షీణించడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రతీయ కమోడిటీ మార్కెట్ లో బంగానం ధరలు గడిచిన ఆరు వారాల్లో తన గరిష్ట స్థాయిల నుండి దాదాపు 25 శాతం మేర పతనం కావడం పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేసింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత బంగారం ధరలు నెల వ్యవధిలో ఇంతగా తగ్గుదల నమోదు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ 2026 ద్వితీయార్థం నాటికి గతంలో ఔన్సుకు 5,700 డాలర్లుగా ఉంటుందని భావించిన ధరను, ఇప్పుడు సుమారు 10 శాతం మేర తగ్గించి 5,200 డాలర్లకు సవరించింది. మార్కెట్ నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం, స్వల్పకాలిక మదుపర్లు ప్రస్తుత పరిస్థితుల్లో వేచి చూసే ధోరణిని అవలంబించడం ఉత్తమం అంటున్నారు.
అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రం ఈ ధరల పతనం ఒక మంచి కొనుగోలు అవకాశంగా కనిపిస్తోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు బంగారం ఎప్పుడూ సురక్షితమైన ఆశ్రయంగా నిలుస్తుందని సూచిస్తున్నారు. పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక మందగమన భయాలు వెండి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. వెండి ధరలు ప్రస్తుతం ఒక నిర్ణీత శ్రేణిలో కదులుతున్నాయని, ఏదైనా ఒక దిశలో స్పష్టమైన మార్పు వచ్చే వరకు మదుపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
