తెలంగాణ నూతన డీజీపీగా సీ.వీ.ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. రిటైరైన డీజీపీ బి.శివధర్ రెడ్డి స్థానంలో ఆయన నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సుమతి తదితరులు పాల్గొన్నారు.
21 ఏళ్లకే సివిల్స్ సాధించిన సీవీ ఆనంద్
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రంగారెడ్డి జిల్లాలో జన్మించిన సీవీ ఆనంద్ కుటుంబం ఆయన చిన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఆనంద్.. నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్ క్రికెట్ టీమ్ తరఫున ఆడారు.ఇండియా అండర్-19 క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకుని ఇంగ్లాండ్ పర్యటన కూడా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (ఎకనామిక్స్)లో గోల్డ్ మెడల్ సాధించారు. మొదటి అటెంప్టులోనే యూపీఎస్‌సీలో 147 ర్యాంకు సాధించి 21 ఏళ్లకే సివిల్స్ కు ఎంపికై ఐపీఎస్ అయ్యారు. సొంత రాష్ట్రం (ఉమ్మడి ఏపీ) కేడర్ రావడం మరో విశేషం. కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌గాను, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, ట్రాఫిక్ కమిషనర్‌గా, జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ (నిసా) డైరెక్టర్‌గా, ఏసీబీ డైరెక్టర్ & విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా , హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత సేవలందించారు. ఉమ్మడి ఏపీలో విజయవాడ కమిషనర్ గానూ పనిచేశారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ (ASP), ఎస్పీ (SP)గా విధులు నిర్వహించారు.
ఆయన భార్య లలితా ఆనంద్ ఐఐటీ పీహెచ్‌డీ, ఐఎస్‌బీ ప్రొఫెసర్. భర్త కెరీర్, పిల్లల పెంపకం కోసం చదువును మధ్యలో ఆపేసిన లలితా ఆనంద్ 40 ఏళ్ల వయసులో మళ్లీ పుస్తకాలు చేతపట్టి ఐఐటీ మద్రాస్ లో పీహెచ్‌డీ(మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ /కార్పొరేట్ ఫైనాన్స్) పూర్తి చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రీసెర్చర్‌గా చేరి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. చిన్నప్పటి నుంచి సాంప్రదాయ నృత్యాలంటే ఇష్టం పెంచుకున్న లలితా ఆనంద్ 57 ఏళ్ల వయసులో భరతనాట్యం అరంగేట్రం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీవీ ఆనంద్ – లలితా దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చామ మిలింద్, చిన్న కుమారుడు నిఖిల్. చామ మిలింద్ హైదరాబాద్ క్రికెట్ టీమ్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్. ఇండియా అండర్-19, ఆర్‌సీబీ (ఐపీఎల్)లో కూడా ఆడారు.
ఇవి కూడా చదవండి :
ఆర్థిక శాఖలో 14 మందికి షోకాజ్ నోటీసులు? ఆమ్యామ్యాలు పెద్దవాళ్లకు, నోటీసులు అధికారులకా..
Sai Srinivas | ‘అల్లుడు శీను’ స్టైల్‌లో ఎంట్రీ.. వైరల్ అవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య రెడ్డి వీడియో
