- ఇదేం న్యాయమంటున్న ఆర్థిక శాఖ అధికారులు
- సచివాలయం రెండో అంతస్తులో బారికేడ్ల పాలన
- దర్శనం దొరక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడిగాపులు
విధాత, హైదరాబాద్:
రాష్ట్ర ఆర్థిక శాఖలో గడచిన కొద్ది నెలలుగా కిందిస్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పెండింగ్ బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఆ ఆదేశాలను ఉన్నతాధికారికి పంపించడం జరుగుతోంది. ఆదేశాలు అమలు చేయకపోవడంతో హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆగ్రహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ ఆర్థిక శాఖలో కిందిస్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుండటం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు 14 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని సమాచారం. తప్పు ఉన్నతాధికారిది అయితే తమను ఎందుకు బాధ్యులు చేస్తున్నారంటూ ఆర్థిక శాఖ అధికారులు లబోదిబోమంటున్నారు. ఇలాగే షోకాజ్ నోటీసులు మున్ముందు జారీ చేస్తే మెరుపు సమ్మె చేస్తామని ఒకరిద్దరు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సచివాలయంలో చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నది. జీపీఎఫ్, మెడికల్ రియింబర్స్‌మెంట్ వంటి బిల్లులను కూడా చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో బకాయిల గుట్ట వేలకోట్ల రూపాయలకు పెరిగింది. బడా బడా కాంట్రాక్టర్లు, కమీషన్లు చెల్లించే వారికి ఠంచన్‌గా డబ్బులు విడుదల చేస్తున్నారని ప్రతిపక్షాలు , ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బకాయిల కోసం సచివాలయంలో రెండో అంతస్తులో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరగుతున్నారు. అయినా ఉన్నతాధికారి ఏమాత్రం చెవికెక్కించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విసుగు చెందిన వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. గత ఏడాది కాలంగా సుమారు వేయి మందికి పైగా హైకోర్టులో కేసులు వేశారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ఊహించుకోవచ్చు. పిటిషన్లను విచారించిన హైకోర్టు, కొన్ని కేసులలో వ్యక్తిగతంగా, మరికొన్ని కేసులను కలిపి ఉమ్మడి ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నది. అయినప్పటికీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఎప్పటికప్పుడు సంబంధిత సెక్షన్ అధికారులు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కి ఫైల్ రూపంలో పంపిస్తున్నారు. ఆ ఫైలు పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడం మూలంగా హైకోర్టు నుంచి అక్షింతలు పడుతున్నాయి. ఆదేశాలు అమలు చేయడం లేదంటూ కొందరు బాధితులు హైకోర్టులో ధిక్కరణ పిటీషన్లు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం జరుగుతోంది. రెండు మూడు కేసులలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది కూడా. వ్యక్తిగతంగా హాజరు కాకుండా సాకులు చెప్పడంతో ఆగ్రహించిన హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో గత నెల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై సంజాయిషీ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. ఎప్పటిలోగా బకాయిలు చెల్లిస్తారో చెప్పాలని కూడా స్పష్టం చేయడం, గడువు కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పడం జరిగింది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి అమలు చేయకుండా తాత్సారం చేయడం శోచనీయమని పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
హైకోర్టు నుంచి చివాట్లతో పాటు ధిక్కారణ నోటీసులు, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు రావడంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తన బాధ్యత లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని కింది స్థాయి అధికారులు చర్చించుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆయనకు ఫైలు రూపంలో పంపిస్తున్నా, తమను బాధ్యులుగా చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని మండిపడుతున్నారు. కొన్ని నెలలుగా 14 మంది ఆర్థిక శాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. బకాయిలు విడుదల చేసే అధికారం ఉన్నతాధికారికి మాత్రమే ఉంటుందని, తమకు ఆ అధికారాలు లేవని కిందిస్థాయి అధికారులు అంటున్నారు. సకాలంలో బిల్లులు, బకాయిలు చెల్లిస్తే సచివాలయంలో రెండో అంతస్తులో డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ వద్దకు సందర్శకులు వెళ్లకుండా బ్యారికేడ్లు ఎందుకు పెట్టారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన వారు కలువకుండా ఉండేందుకే బ్యారికేడ్లు పెట్టారని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిరంకుశంగా వ్యవహరించలేదని సచివాలయ ఉద్యోగులు వ్యాఖ్యానించడం గమనార్హం. సందర్శకులను కలవడం ఇష్టం లేనప్పుడు అధికారికంగా ప్రసార, ప్రచార సాధనాల ద్వారా ఒక ప్రకటన జారీ చేస్తే ఎవరూ రారని అంటున్నారు.
