Telangana Debt Burden | రాష్ట్ర ఖనాజాకు భారంగా మారిన వడ్డీ చెల్లింపులు.. తీరు మార్చుకోని పాలకులు

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల భారం కకావికలు చేస్తున్నది. అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించేందుకు సైతం అప్పులు చేసే దుస్థితిలో తెలంగాణ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Telangana Debt Burden | రాష్ట్ర ఖనాజాకు భారంగా మారిన వడ్డీ చెల్లింపులు.. తీరు మార్చుకోని పాలకులు

హైదరాబాద్, విధాత :
Telangana Debt Burden | అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. రాజకీయ లబ్ధి కోసం ఆయా ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు, వాటి వడ్డీలు తెలంగాణ ఖజానాకు మోయలేని భారంగా తయారవుతున్నాయి. తెస్తున్న అప్పులకు, వాటికి కట్టే వడ్డీలకు తీవ్ర వ్యత్యాసం ఉంటున్నది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఆదాయం మొత్తం అప్పులు, వాటి వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంపద సృష్టించడానికే అప్పులు చేస్తున్నామని వాదిస్తున్న ప్రభుత్వాలు.. ఎంత సంపద పెరిగింది? ఎంత సంపాదన పెరిగింది? అనే విషయాలను మాత్రం చెప్పడం లేదు. కానీ.. చేసిన అప్పులకు వడ్డీ భారం మాత్రం ప్రజలందరి నెత్తిన కూర్చుంటున్నది. ఎందుకంటే.. పరిపాలించేది ఏ ముఖ్యమంత్రి అయినా.. చేసిన అప్పులు తీర్చాల్సింది అంతిమంగా ప్రజలే. ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వాటిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణభారం పెరిగిన కొద్దీ ప్రజలపై బాడుడు అంతే స్థాయిలో ఉంటుందని గుర్తించాలని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు గతంలోలా నేరుగా నేరుగా పన్నులు వేయకుండా.. పరోక్షంగా ప్రజల ఆదాయాన్ని గుంజేస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన అప్పు 75 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఆ తరువాత బీఆరెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ.6 లక్షల కోట్ల వరకు అప్పు చేసింది. మొత్తంగా కలిపి 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.6.71 కోట్లకు చేరింది. తీసుకున్న అప్పులో ప్రభుత్వం చెల్లించిన అసలు రూ.77,067 కోట్లు మాత్రమే. వడ్డీ కింద చెల్లించింది.. రూ.1,57,117 కోట్లు. అంటే.. అసలు, వడ్డీ కలిపితే.. ఇప్పటి వరకూ చెల్లించింది.. రూ.2,34,183 కోట్లు. బీఆరెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ.2.34 లక్షల కోట్లు చెల్లించిన తరువాత కూడా అప్పు రూ.6 లక్షల కోట్లకు పైగా ఉన్నదంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడానికి కఠినమైన ఆర్థిక ప్రణాళిక అమలు చేసి, అప్పులు తీర్చాల్సిన కాంగ్రెస్ సర్కారు ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్‌కు తానేమీ తక్కువ కాదన్నరీతిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం ఉచిత పథకాల మీద పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 19 నెలల్లోనే రూ.1.66 లక్షల కోట్ల రుణం తెచ్చారు. దీనికి వడ్డీ, అసలు చెల్లించాల్సిందే.

రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి నెల ట్రెజరరీ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగా వడ్డీ చెల్లింపులు లాగేసుకుంటుంది. అవి పోను ఖజానాలో మిగిలిన సొమ్మునే ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. రుణాల మంజూరు ఎఫెక్ట్‌ అవుతుంది. పైగా అక్కౌంట్లు ఫ్రీజ్‌ చేసే ప్రమాదమూ ఉంటుంది. దీంతో అనివార్యంగా ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అవి సరిపోక మళ్లీ రుణాల కోసం రిజర్వు బ్యాంకు వద్ద క్యూ కడుతుంది. ఈ చైన్ సిస్టమ్‌ను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తాయన్న ఆశ లేకుండా పోతున్నదని విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి కూడా అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. చేసిన అప్పులో పదిశాతం కూడా అసలు చెల్లించలేక పోతున్నామని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. దీన్ని గమనిస్తే.. ఏటా పాలకులు మిత్తీలు చెల్లించడానికే అప్పులు చేసే పరిస్థితికి రాష్ట్రం వెళ్లిపోయిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఆదాయం.. తెచ్చిన అప్పుల నుంచి దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఏటా చేస్తున్న రుణంతోపాటు.. తీరుస్తున్న అసలు ఎంత? వడ్డీ ఎంత? ఇంకా ఎంత అప్పు ఉంది.. అనే వివరాలను సమగ్రంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు, ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

9 ఏళ్ల‌లో బీఆరెస్ చేసిన బ‌డ్జెట్ రుణాలు… రూ.3. 90 కోట్లు
బడ్జెటేతర రుణాలు… రూ.2.82 కోట్లు

2023 డిసెంబర్ వరకు రుణ చెల్లింపుల పట్టిక (రూ. కోట్లలో)

  • కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత 2025 మార్చి వరకు చేసి అప్పులు బడ్జెట్, బడ్జేటేతరం కలిపి రూ.1.66 లక్షల కోట్లు.
  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చేసిన బడ్జెట్ అప్పు రూ.80 వేల కోట్లు.
  • బడ్జెట్ అప్పుల కోసం చెల్లించిన నెలవారి కిస్తీలు (ఇందులో అసలు,మిత్తి కలిపి ఉండే అవకాశం ఉంది ) రూ.56,792.62 కోట్లు.