Ticket Price:
విధాత: కర్ణాటకలో సినిమా టికెట్ ధరలకు పరిమితి విధిస్తూ సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు రూ.200మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2025-26బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సిద్దరామయ్య సినిమా టికెట్ల పరిమితిపై నిర్ణయాన్ని వెల్లడించారు. సినిమా రంగాన్ని ప్రొత్సహించేందుకు..సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకే టికెట్ ధరలను రూ. 200లుగా నిర్ణయించామన్నారు.
ఇకపై మల్టీఫ్లెక్సీలతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో , అన్ని షోలకు ఇదే రేటు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్ లో ఫిలిం సిటీని 150ఎకరాల్లో నిర్మించేందుకు భూమి కేటాయిస్తున్నామని..దీని నిర్మాణానికి రూ.500కోట్ల బడ్జెట్ ను కేటాయించామని సిద్ధరామయ్య ప్రకటించారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను సైతం అందుబాటులోకి తక్కువ ధరకే తీసుకరాబోతున్నట్లుగా తెలిపారు.
కాగా ప్రభుత్వమే ఓటీటీ తీసుకురానున్న నేపథ్యంలో ప్రైవేటు ఓటీటీల ధరలు దిగివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సినీమా టికెట్ ధరలపై పరిమితుల పట్ల సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సినీ పరిశ్రమ వర్గాలు మాత్రం అసంతృప్తి చెందుతున్నాయి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ పేరుతో వందలు, వేలకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల ధరలు ప్రేక్షకులకు భారంగా ఉన్నా.. నిర్మాతలకు మాత్రం ఊరటగా ఉన్నాయి. టికెట్ ధరలను రూ.200లకే పరిమితం చేయడంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణానికి నిర్మాతలు వెనుకడుగు వేసే ప్రమాదముందన్న వాదన వినిపిస్తుంది.