న్యూఢిల్లీ : కష్టాలన్ని ఒకేసారి వస్తాయన్నట్లుగా ఉంది బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లలూప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)పరిస్థితి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వైపు ఘోర ఓటమి..మరోవైపు కుటుంబ కలహాలతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం(Family Dispute) తల్లడిల్లిపోతుంది. లాలు కుటుంబం నుంచి, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించిన కూతురు రోహిణి ఆచార్య(Rohini Acharya) సోదరులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లతో మరింత రచ్చ చేస్తుంది.
తాజాగా రోహిణి ఆచార్య సోదరుడు తేజస్వీ యాదవ్పై సంచలన ఆరోపణలు చేసింది. తేజస్వీ, ఆయన సహాయకులు నన్ను కుటుంబం నుంచి బయటకు పంపారని.. నన్ను అనాథను చేశారని ఆరోపించింది. అసభ్యకరంగా తిట్టారు, చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారని, సత్యాన్ని వాళ్లకు లొంగనీయలేదు. కేవలం అందుకోసమే అవమానాలను ఎదుర్కొన్నానని ఆరోపించింది. నా ఆత్మ గౌరవం విషయంలో రాజీపడబోనని రోహిణి ఆచార్య తన పోస్టులో పేర్కొంది. ‘నిన్న ఓ కుమార్తె, సోదరి, గృహిణి, తల్లి అవమానం ఎదుర్కొన్నారంటూ ట్విట్ లో తెలిపింది.
నా పరిస్థితి ఏ కూతురు, సోదరినికి రావద్దంటూ ఆవేదన
ఓటమితో ఏడుస్తున్న సోదరిని, తల్లిదండ్రులను నిన్న ఓ కూతురు నిస్సహాయతతో వదిలివెళ్లిందని, మా అమ్మ ఇంటిని వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చిందని… నన్ను అనాథను చేశారని రోహిణి ఆచార్య వాపోయింది. మీరు ఎప్పటికీ నా మార్గాన్ని అనుసరించవద్దంటూ.. ఏ కుటుంబానికి రోహిణీ వంటి కుమార్తె, సోదరి ఉండకూడదని కోరుకుంటున్నా అని మరో భావోద్వేగపూరిత పోస్టు చేశారు. నిన్న నన్ను మురికిదానిని అని తిట్టారని, నా మురికి కిడ్నీనే తండ్రికి మార్పిడి చేయించానని… రూ.కోట్లు, టికెట్లు తీసుకొన్నాకే మురికి కిడ్నీ ఇచ్చాను అంటూ తన పట్ల కుటుంబం వ్యవహరించిన తీరుపై ఆవేదన వెళ్లగక్కింది.
నా నుంచి చాలా పెద్ద తప్పు జరిగిందని..నేను నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను చూసుకోలేదు. కిడ్నీ ఇచ్చే సమయంలో నా భర్త, అత్తమామల అనుమతి తీసుకోలేదు. నా దేవుడు వంటి తండ్రిని కాపాడుకొనేందుకు ఆ పనిచేశానని.. ఇప్పుడు మురికిదానిని అని మాటలు పడుతున్నానని. మీరంతా నాలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదని.. రోహిణీ వంటి కుమార్తె ఏ ఇంట్లోనూ ఉండకూడదు అంటూ మరో ఆమె పోస్ట్ చేశారు. అంతకు ముందు ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, తేజస్వీ మిత్రుడు రమీజ్ ఖాన్ కారణంగానే తాను కుటుంబాన్ని వీడినట్లు రోహిణీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడంపై అసంతృప్తిగా ఉన్న రోహిణి కుటుంబంపై తన అసహనాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తేజస్వి యాదవ్ కి మద్దతుగానే ప్రచారం చేయడం గమనార్హం.
