విధాత : మావోయిస్టు పార్టీ వారోత్సవాల(Maoist Weeks)వేళ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem)జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెం సమీపంలో ప్రధాన రహదారిపై వెలిసిన మావోయిస్టుల బ్యానర్లు(Maoist Banners), కరపత్రాలు కలకలం రేపాయి. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు నక్సల్స్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులో ఈ బ్యానర్ల ద్వారా పిలుపునిచ్చారు. గడిచిన ఏడాది కాలంలో 194మంది పార్టీ నాయకులు, సభ్యులు హతమయ్యారని వారి సంస్మరణార్ధం గ్రామగ్రామన సంస్మరణ సభలు నిర్వహించాలని కోరారు. మావోయిస్టుల బ్యానర్ల ఘటనతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం భద్రాచలం సబ్ డివిజన్ల సరిహద్దుల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, ఛత్తీస్‌గఢ్ వెళ్లే రహదారిలో వాహనాలను సీఆర్పీఎఫ్ జవాన్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీస్ జాగిలాలతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. వచ్చే మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బతింది. వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ బలం వేల నుంచి వందల్లోకి పడిపోయింది. అగ్రనేతలు సైతం ఎన్ కౌంటర్లలో హతమవ్వడంతో పార్టీ ముందెన్నడు రీతిలో మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మరోసారి తన ఉనికిని చాటేందుకు వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.