Site icon vidhaatha

Mumbai dating scam । అమ్మాయి పిలిచిందని రొమాన్సుకు పోతే.. 61 వేలకు బిల్లొచ్చింది!

Mumbai dating scam । మార్మానానికి పోతే.. తెల్లారొచ్చేసరికి ఇల్లు గుల్లైందని తెలంగాణలో ఓ మోటు సామెత ఉన్నది. ముంబైలో (Mumbai) ఈ పోరగాళ్ల పరిస్థితీ అలాగే తయారైంది. యాప్‌లో కలిసి, (dating scams) రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. రారమ్మని సంకేతాలు ఇవ్వగానే.. ఇంకేముంది.. ఏమేమో ఊహించుకుని.. చెప్పిన స్టార్‌ హోటల్‌(star hotel)కు వెళ్లిన వాళ్లకి అమ్మాయి పలకరింపులు.. కలిసి మందు తాగడాలు అంతవరకూ బాగానే ఉంది. గుండె గుభేలనిపించేలా బిల్లొచ్చేసరికి ఏం చేయాలో పాలుపోలేదు.. తామొక ట్రాప్‌లో ఇరుక్కున్నామని అర్థమయ్యే సరికే ఆ పిల్ల కాస్తా అర్జెంటు పని ఉంది మళ్లీ కలుస్తా.. అంటూ తుర్రుమన్నది. ఇటు చూస్తే పర్సు పేలిపోయేంత బిల్లు! బిల్లు కట్టకపోతే తాట తీస్తామంటూ హాఫ్‌ షర్ట్‌ చేతులు మడతపెడితే కండలు కనిపిస్తున్న కొండల్లాంటి బౌన్సర్లు (bouncers) వార్నింగులు! ఎవరికీ చెప్పుకొనే దిక్కు లేదు.. చెప్పుకున్నా సిగ్గు చేటు! దీంతో కల చెదిరింది.. కథ మారింది.. బిల్లు కట్టడమే ఇక మిగిలింది అంటూ సదరు కుర్రాళ్లు ఓ శాడ్‌ సాంగేసుకుని బతుకు జీవుడా అంటు బయటపడుతున్నారట! ఇది ముంబైలో తాజాగా కొనసాగుతున్న డేటింగ్‌ స్కాం! అమ్మాయి పిలిచిందని పొలోమని పోయి.. ఉన్నది రాల్చుకుని వస్తే.. దాన్ని స్కాం అంటారేంటన్న వాళ్లూ ఉన్నారు. అది పక్కన పెడితే.. ఇప్పుడు ముంబై యువత మాత్రం డజన్ల సంఖ్యలో చిక్కకున్నారన్న వార్తలు మాత్రం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఖరీదైన మద్యం ఆర్డర్‌..

టిండర్‌, బంబల్‌ వంటి వివిధ డేటింగ్‌ యాప్స్‌ ద్వారా పురుషులను ఆకర్షిస్తున్నట్టు తేలింది. ఖరీదైన బార్లు, క్లబ్లులకు తీసుకెళ్లి.. ఖరీదైన మద్యం ఆర్డర్‌ ఇచ్చి.. చక్కగా తాగేసిన తర్వాత బిల్లును అబ్బాయి ముఖాన పడేసి.. జారుకుంటున్నారు. ఈ మేరకు దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ (Deepika Narayan Bhardwaj) అనే న్యాయవాది, యాక్టివిస్టు ఎక్స్‌లో పోస్టు చేసిన వివరాలు సంచలనం రేపుతున్నాయి.  రొమాంటిక్‌ పార్ట్‌నర్స్‌ కోసం యాప్స్‌పై ఆధారపడేవాళ్లకు గట్టి వార్నింగే ఇస్తున్నాయి. దాదాపు 12 మంది బాధితుల బాధలను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. బిల్లులు 23వేల నుంచి 61 వేల వరకూ వచ్చాయని, అందులో ముగ్గురు వ్యక్తులకు ఒకే యువతి  టోకరా ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బిల్లులను ఫొటో తీసి షేర్‌ చేశారు. వాటిలో ఒకదాని టోటల్‌ బిల్లు 61,743 ఉంది. అందులో ఒక్కోటి ఐదు వేల చొప్పున రెండు కాక్‌టెయిల్స్‌ సహా నాలుగు ఐటమ్స్‌ మాత్రమే ఉన్నాయి. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న గాడ్‌ ఫాదర్‌ క్లబ్‌లో ఈ తతంగం యథేచ్ఛగా సాగుతున్నదని ఆమె తెలిపారు. ఆమె పోస్ట్‌ దాదాపు 40 లక్షల మంది చూశారు.

 

అసలేంటీ స్కామ్‌!

దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ మరొక పోస్టులో ఈ స్కాం మోడస్‌ ఆపరెండీని వివరించారు. ‘డేటింగ్‌ యాప్‌లో కనెక్టవుతారు. కాసేపు అలా కలుద్దాం అంటారు. గాడ్‌ఫాదర్‌లో కలుద్దామని ఒత్తిడి చేస్తారు. డ్రింక్స్‌, హుక్కా, ఫైర్‌షాట్‌ ఆర్డర్‌ ఇస్తారు.. ఆర్డర్‌ ఇచ్చే సమయంలో సదరు వ్యక్తికి మెనూ కార్డ్‌ చూపరు. అంతా అయ్యాక బిల్లు వేలల్లో వస్తుంది. అప్పటికే ఏదో ఒక నెపంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి పరార్‌.. బల్లు కట్టకపోతే చావబాదేందుకు బౌన్సర్లు సిద్ధం.. అంటూ ఆమె వివరించారు.

 

పాపం ఈ బాధితుడి  కథే వేరు

ఒక బాధితుడి కథనాన్ని కూడా ఆమె షేర్‌ చేశారు. దాని ప్రకారం.. 2024 జూలై 20న ఒకమ్మాయి ఫోన్‌ చేసి అంధేరీ వెస్ట్‌లోని డెకాథ్లాన్‌ వద్ద కలుసుకుందామని చెప్పింది. అక్కడి నుంచి గాడ్‌ ఫాదర్‌ క్లబ్‌కు నన్ను తీసుకెళ్లింది. మెనూ చూడకుండానే డ్రింక్స్‌ ఆర్డర్‌ ఇవ్వడం మొదలు పెట్టింది. నేను మద్యం తాగను. అందుకే మాక్‌టెయిల్‌ ఆర్డర్‌ ఇచ్చాను. ఆమె హుక్కా కూడా ఆర్డర్‌ ఇచ్చింది. ఓ గంట గడిచిన తర్వాత ఆమె ఉన్నట్టుండి.. నాకు ఆలస్యం అయిపోతున్నదంటూ హడావుడి చేసింది. ఈ ఒక్క గంట కోసమే ఆమె ఇంత మేకప్‌ ఎందుకు వేసుకున్నదో అర్థం కాలేదు. బిల్లు ఇవ్వాలని బేరర్‌ను అడిగింది. బిల్లు చూస్తే 24వేలు ఉన్నది. ఆమె ఆల్కహాల్‌ను 8, 9 సార్లు రిపీట్‌ చేసింది. అది నాకు తెలియనే లేదు. బిల్లు కరెక్టేనా? అని ఆమెను అడిగాను. ఈ రేట్లన్నీ ఇక్కడ మామూలేనని బదులిస్తూనే రేట్లు కొంచెం ఎక్కువగానే  ఉన్నాయన్నది. బిల్లులో హుక్కా పేరు లేదు. కానీ.. దానికి చార్జి మాక్‌టెయిల్‌ పేరుతో వేశారు. ఎందుకంటే.. ఇండియాలో హుక్కా నిషిద్ధం కాబట్టి. కనీసం హుక్కా అయినా పీల్చు.. ఇదేమీ పొగాకు కాదు.. అని నాకు చెప్పబోయింది. నేను హుక్కా తీసుకోలేదు. ఇక  బిల్లు విషయానికి వస్తే.. నాకు మరో మార్గం లేదు కనుక బిల్లు పే చేయాల్సి వచ్చింది. ఆ బిల్లుపై నా సంతకాన్ని కూడా వాళ్లు తీసుకున్నారు. నేను ఇంటికి వెళ్లిపోయాను. ఇంటికి వెళ్లాక ఆమె ఫోన్‌ చేసి, శృంగారానికి ప్రపోజ్‌ చేసింది. డ్రింక్స్‌ కొనిస్తే.. ఐదు వేలకే వస్తానని చెప్పింది. నేను తిరస్కరించాను. ఆమె నా ఫోన్‌ బ్లాక్‌ చేసింది. ఇదేదో స్కామ్‌ అని నాకు అర్థమైంది. నెట్‌లో వెతికి ధృవీకరించుకున్నాను’ అని సదరు బాధితుడు పేర్కొన్నాడు.

Exit mobile version