Jubileehills Byepoll | జూబ్లీహిల్స్ బైపోల్‌.. ఎమ్మెల్యేలపై కేసులు నమోదు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాదు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నియామవళిని ఉల్లంఘించిన పలువురు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

విధాత, హైదరాబాద్ :

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాదు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. పోలింగ్‌ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించడంతో, వారిపై కేసులు నమోదు చేశారు.

మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌, రాందాస్‌లపై రెండు కేసులు నమోదు చేశారు. బోరబండ పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, మెతుకు ఆనంద్‌లపై ఒక కేసు నమోదైనట్లు హైదరాబాదు పోలీస్‌ కమిషనరేట్‌ అధికారిక ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే కేవలం ఒక సాంప్రదాయ ప్రక్రియ కాదని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉండే నిబంధనల సమాహారం అని తెలిపారు. ఏ వ్యక్తి, ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఎన్నికల న్యాయసూత్రాలే దెబ్బతింటాయన్నారు.

పోలింగ్‌ రోజు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతల అనుచరులు ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారని, కొన్ని చోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద గుంపులు ఏర్పడ్డాయని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు సేకరించిన తరువాతే కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగడానికి ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త సహకరించాలని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు కనిపించిన వెంటనే డయల్‌ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. కాగా, జూబ్లీహిల్స్ బైపోల్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరుగంటల వరకు ఉప ఎన్నిక కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.