Site icon vidhaatha

Bhatti Vikramarka: విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా

దేశ చరిత్రలోనే ఓ రికార్డు

ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుంది

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌, మే26(విధాత‌): రాష్ట్రంలో ప్ర‌భుత్వ విద్యుత్ సంస్థ‌ల‌లో ప‌ని చేస్తున్న‌ విద్యుత్ కార్మికుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల ప్ర‌మాద బీమా ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌మాద బీమాను వెంట‌నే అమ‌లు చేస్తున్న‌ట్లు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లోని ట్రాన్స్ కో.. జెన్ కో.. నార్త్, సౌత్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల‌లో ప‌ని చేస్తున్న దాదాపు 40 వేల మంది కార్మికుల‌కు ఈ ప్ర‌మాద బీమా ప‌థ‌కం వ‌ర్తించ‌నున్న‌ది. ప్ర‌మాద బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తూ ఎన్‌పీడీసీఎల్‌ (Npdcl) పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖలో నరేష్ స‌తీమ‌ణికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డని అన్నారు. విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైంద‌న్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదని తెలిపారు.

ప్రమాద బీమా తోపాటు కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు , మానవీయ కోణానికి అద్దం పడుతుంద‌న్నారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కోటి రూపాయల పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల అందరిలో ఓ కొత్త భరోసా నింపుతుంద‌న్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్‌పీడీసీఎల్‌(NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డిని డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి విద్యుత్తు, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version