రాజకీయాలు అంటేనే వ్యాపారం అయిపోయింది. ఒకనాడు నేతలు ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తే… నేడు తమ వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడం కోసం.. కోట్లకొద్దీ సొమ్మును అక్రమంగా సంపాదించుకోవడమే లక్ష్యంగా అనేక మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఎంత వెనుకేసుకుందామని ఆలోచించే వారే కానీ… ఎంతో కొంత ప్రజలకు పంచుదామనే నేతలే కరువయ్యారు. పక్కోడి బుద్ధి మాంసం ముక్క దగ్గరే తెలుస్తుందన్నట్లుగా ప్రజలకు ఆపద వచ్చినప్పుడే నాయకుల అసలు రంగు బయటకు వస్తుందని అంటారు.
ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలలో అనేక ప్రకృతి విపత్తులు వచ్చాయి. అలా వచ్చిన ప్రకృతి విపత్తుల సమయంలో వ్యాపారస్థులు, స్వచ్ఛంద సంస్థలు, సినిమా ప్రముఖులు ఇలా ఎందరెందరో ఆపన్న హస్తం అందించారు. నగదు, వస్తు రూపేణా సహాయం చేశారు కానీ నేతలు తమ స్వంత సంపాదన నుంచి సహాయం చేసేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరిగా పవన్ కల్యాణ్ నిలిచారు. భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలతో దెబ్బతిన్న గ్రామాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ భారీ నగదు సహాయం అందించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
ఏపీలో 400 గ్రామాలు వరదలకు దెబ్బతిన్నాయని అధికారుల నుంచి సమాచారం తెప్పించుకున్న పవణ్ కళ్యాణ్.. ఏకంగా గ్రామానికి లక్ష రూపాయల చొప్పున 400 గ్రామాలకు నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ నగదును గ్రామాల్లో తక్షణ అవసరాలకు ఖర్చు చేసుకోవడానికి వీలుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ చేయడం గమనార్హం. అలాగే ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌కు కోటి, పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు కూడా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. పవణ్ కళ్యాణ్ తీసుకున్న చొరవ, చేసిన సహాయానికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. రాజకీయ నాయకులు వందల కోట్లు కూడబెట్టుకోవడమే కాదు.. ఇలాంటప్పుడు వితరణ చేసి ఆదుకుంటే మంచిందని సెలవిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వరద బాధితులకు సహాయార్థం కోటి రూపాయల చొప్పున అందించారు.
