విధాత, వరంగల్ ప్రతినిధి:
విప్లవ విద్యార్థి పోరాట వారసత్వ చరిత్ర పీడీఎస్‌యూ సొంతమని పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే అన్నారు. డిసెంబర్ 10,11,12 తేదీల్లో వరంగల్ లో జరిగే పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల లోగోను ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ తో కలిసి మంగళవారం హనుమకొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యమాల కేంద్రంలో మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పేదలకు విద్య మరింత దూరం అవుతుందన్నారు. ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం అవుతున్నదని, అనేక పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు మూసివేతకు గురవుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటుపరం అయ్యాయని, విద్యా రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చిందన్నారు. దీంతో దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు పెరిగి ఆర్థిక భారంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాల్లో మూఢనమ్మకాలను, మతోన్మాదాన్ని చొప్పిస్తుందన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో గాంధీని చంపిన గాడ్సే పాఠాలను తీసివేయడం చరిత్ర వక్రీకరణలో భాగం అని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, యువకుల పోరాటాలు నడుస్తున్నాయన్నారు. అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయని, ఈ స్ఫూర్తితో విద్యార్థి లోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద,రంగవల్లి, కోలాశంకర్, చేరాలు లాంటి ఎందరో అమరవీరుల త్యాగంతో పురుడుబోసు కున్న పీడీఎస్‌యూ ఉద్యమాన్నీ తీవ్రతరం చేయాలని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పిలుపునిచ్చారు.
రేవంత్ సర్కారు విఫలం..
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కనీసం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. డిసెంబర్ 10న ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం ముందు బహిరంగ సభ,11 ,12 తేదీల్లో అబ్నుస్ ఫంక్షన్ హాల్లో జరిగే ప్రతినిధుల సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జాతీయ నాయకులు పి.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, డాక్టర్ రాజేష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, పీడీఎస్‌యూ మాజీ నాయకులు బాలరాజు, బండి కోటేశ్వర్, అనిల్ రాజేష్, ప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.