మావోయిస్టుల సానుకూల స్పందన
అడవి ప్రాంతంలో యుద్ద వాతావరణం నివారించి, శాంతియుత వాతావరణంలో చర్చలకు అవసరమైన చర్యలు చేపట్టాలని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు…
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పందన
ఈ పరిస్థితిని నివారించేందుకు గత మూడు నెలలుగా శాంతి చర్చల కమిటీ తమవంతు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు…
కర్రెగుట్ట ముట్టడిపై ఆందోళన
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను వేలాదిమంది సాయిధబలగాలు ముట్టడించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ తక్షణం నిలిపివేయాలని కోరారు…
విధాత ప్రత్యేక ప్రతినిధి: అడవి ప్రాంతంలో యుద్ద వాతావరణం నివారించి, శాంతియుత వాతావరణంలో చర్చలకు అవసరమైన చర్యలు చేపట్టాలని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధకాండ వల్ల మావోయిస్టులతో పాటు అనేకమంది గిరిజన ప్రజలు, సాయుధ బలగాల ప్రతినిధులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని నివారించేందుకు గత మూడు నెలలుగా శాంతి చర్చల కమిటీ తమవంతు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
చర్చలకు సానుకూల వాతావరణ ఏర్పడేందుకు నిర్దిష్ట కాల పరిమితుతో ఇరువర్గాలు కాల్పుల విరమణ పాటించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను వేలాదిమంది సాయిధబలగాలు ముట్టడించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ తక్షణం నిలిపివేయాలని కోరారు. మావోయిస్టు పార్టీ శ్రేణులు కర్రెగుట్టలలో ఆశ్రయం పొందారనే సమాచారం మేరకు సాయిధబలగాలు చుట్టుముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలని, ఆయా ప్రాంతాల్లో శాంతి నెలకొని హింసాత్మక వాతావరణం శాశ్వతంగా తొలగిపోవాలని ప్రయత్నం చేస్తున్నామని చర్చల కమిటీ ప్రతినిధులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టలలో వందలాది మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటున్నారని తెలిసి, సీఆర్పీఎఫ్, కోబ్రా, తెలంగాణ నుండి గ్రేహౌండ్స్ దళాలు వారిని చుట్టుముడుతున్నట్టు వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయని తెలిపారు.
ఇది తప్పకుండా మరింత పెద్దఎత్తున మానవ ప్రాణ నష్టం, మారణహోమాలకు దారి తీయగలదన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ హింసాత్మక వాతావరణం తొలగిపోయే విధంగా ఒక శాశ్వత, శాంతియుత పరిష్కార మార్గానికి సహకరిస్తామనే ఆశాజనకమైన ప్రకటనలు మావోయిస్టుల నుండి వస్తున్న ఈ తరుణంలో పాత, కక్షాపూరిత విధానాన్నే అవలంభించటం రాజనీతిజ్ఞులైన పాలకుల లక్షణం కాదని గుర్తు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో 28 మంది పర్యాటకులపై ఉగ్ర దాడిని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ లేఖ శాంతి చర్చల కమిటీ చైర్మన్, రిటైర్డ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్, వైస్ చైర్మన్ జంపన్న, ప్రొఫెసర్ వినాయక రెడ్డి, ఫ్రీడం ఫైటర్, రచయిత కే ప్రతాప్ రెడ్డి, హెచ్‌ఆర్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీవన్ కుమార్, పీయూసీఎల్ ప్రెసిడెంట్ సీహెచ్ బాలకిషన్ రావు, హెచ్‌ఆర్‌ఎఫ్ సెక్రటరీ డాక్టర్ తిరుపతయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సీపీఎం చలపతి రావు, గుర్రం వినయ్ కుమార్, హన్మేశ్, ఆరెస్పీ నాయకులు జానకిరామ్, సీనియర్ జర్నలిస్ట్ టీ తిరుమల్ పేర్లతో విడుదలైంది.