విధాత : మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) కూలిపోబోతుందని రాష్ట్రీయ లోక్ దళ్(Rashtriya Lok Dal) రాష్ట్ర అధ్యక్షులు.. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్Dilip Kumar సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన సామాజిక తెలంగాణ సాధన రథయాత్ర నల్గొండకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రల నుంచే ముప్పు ఉందన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy)ని ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తుందన్నారు. ఆయన చాలా మంచివారు నిజాయితీపరుడని తాను ఆయనతోనే కలిసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని గుర్తు చేశారు. పార్టీలో చేరికల సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన ఆ పార్టీ నాయకత్వం మాట తప్పిందన్నారు. రాజగోపాల్ రెడ్డి కి 30నుంచి 40మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆయన రాబోయే మూడు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని దిలీప్ కుమార్ జోస్యం చెప్పారు. ఎలాగూ ఖజానాలో డబ్బులు లేవని రేవంత్ రెడ్డి చెప్తున్నందున ప్రభుత్వం కూలిపోయినా నష్టం లేదని ఆయన ఇంట్లో కూర్చోవడం బెటర్ అన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించినా ఒరిగేది ఏమీ లేదన్నారు.
బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక తెలంగాణ కల సాకారం అవుతుందని భావించామని, కానీ కేసీఆర్ కుటుంబం పాలనలో తెలంగాణ దోపిడికి గురైందన్నారు. అన్ని రంగాలను స ర్వనాశనం చేశారని దుయ్యబుట్టారు. వా ళ్లను దించి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే వీళ్లు అదే దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే వారందరు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమలలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇచ్చే విదంగా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 28లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించి సొంత పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.
