Kolkata doctor murder । కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో (RG Kar Medical College and Hospital) లైంగికదాడి, హత్యకు గురైన మెడికో కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నది. ఈ ఘటన వెనుక ఒక్కరికంటే ఎక్కువ మంది పాత్ర ఉండి ఉంటుందనే అనుమానాలను పోస్టుమార్టం నివేదిక వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, కళాశాల వైద్యులు ఇతరులను సైతం సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని, తాను అమాయకుడినని అరెస్టయిన సంజయ్ రాయ్ చెబుతున్నాడు. రక్తపు మరకలతో ఉన్న డాక్టర్‌ను చూశానని తన లాయర్ కవిత సర్కార్‌కు చెప్పడం సంచలనం రేకెత్తిస్తున్నది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌రాయ్‌ను ఆగస్ట్ 10న కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. మెడికో లైంగిక దాడికి, హత్యకు గురైన సెమినార్ హాల్‌లో అతడి బ్లూటూత్ హెడ్‌సెట్ సైతం దొరికింది. పాలిగ్రాఫ్ (polygraph) టెస్టులో సైతం తన క్లయింట్ తాను నిర్దోషినని చెప్పాడని అతడి తరఫు న్యాయవాది కవిత సర్కార్ అన్నారు. హత్య తర్వాత ఏం చేశాడనే అంశం సహా మొత్తం పది ప్రశ్నలను సంజయ్‌రాయ్‌ను అడిగారని టాయ్ పేర్కొన్నది.
అసలు ఈ హత్యను తాను చేయనందున ఈ ప్రశ్న చెల్లేది కాదని సీబీఐ అధికారులకు సంజయ్‌రాజ్ చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే.. దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాను హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌కు చేరుకునే సమయానికే ట్రైనీ డాక్టర్ స్పృహ కోల్పోయి (unconscious) ఉన్నట్టు రాయ్ చెప్పినట్టు సమాచారం. ఆగస్ట్ 9 రాత్రి సెమినార్ హాల్‌లో ఆమె నెత్తుటి మడుగులో పడి ఉన్నట్టు చెప్పాడని తెలిసింది. దీంతో భయంతో తాను ఆ గది నుంచి బయటకు పరుగు తీశానని వెల్లడించినట్టు సమాచారం. మృతురాలు ఎవరో కూడా తనకు తెలియదని, తనను ఈ కేసులో ఇరికించారని అతడు చెప్పినట్టు తెలిసింది. తప్పు చేయకపోయి ఉంటే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నకు.. తనకు భయమేసిందని, తనను ఎవ్వరూ నమ్మరని అనుకున్నానని చెప్పాడు.
అసలైన నిందితుడు మరెవరో అయి ఉంటారని సంజయ్‌రాయ్ తరఫు న్యాయవాది కవిత సర్కార్ అన్నారు. ‘అతడు సెమినార్ హాల్‌కు వెళ్లగలిగాడంటే అక్కడ భద్రతా వైఫల్యం ఉన్నదని తెలుస్తున్నది. దానిని వేరొకరు సావకాశంగా తీసుకుని ఉంటారు’ అని కవిత సర్కార్ అన్నారు.