విధాత : బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లు(BC Reservation Bill) ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ చేపట్టిన ‘చలో ఢిల్లీ(Chalo Delhi)’ కార్యక్రమం కోసం పార్టీ నాయకులు సోమవారం చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీ బయలుదేరారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున కాంగ్రెస్ నాయకులు ఛలో ఢిల్లీ కోసం రైలులో వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం, రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్‌తో ఈనెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది.
ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినా కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చ కోరుతూ మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇవ్వనున్నారు.