విధాత : తిరుమలలోని హథీరాంజీ మఠం(Tirumala Hathiramji Matham) పరిరక్షణకు తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు. అదివారం తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోట్ రామచందర్ నాయక్, ఎంపీలు ఈటల రాజేందర్(Etela Rajender), బలరాం నాయక్(Balaram Naik), మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు. వారంతా హథీరాంజీ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ హథీరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించి మిగిలిన భూములను కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీని ఈటల కోరారు. మఠం బాధ్యతలను బంజారాలకు అప్పగించాలని కోరారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ మఠానికి సంబంధించిన బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీలో బంజారాలకు అవకాశం కల్పించాలని కోరారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) సైతం హథీరాంజీ బాబా మఠం సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, మఠం నిర్వహణను బంజారాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 25 నుంచి చేపట్టనున్న తెలంగాణ జాగృతి జనం బాట యాత్ర నేపథ్యంలో కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనతరం హాథిరాం బాబాజీ మఠాన్ని సందర్శించి బర్సి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. ఎంతో చరిత్ర ఉన్న హథీరాంజీ బాబా మఠం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.