Etela Rajendar : సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడంతో వల్లకాడులా మారిన గ్రామాలు

సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాలు వల్లకాడులా మారాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు లేకా నిధులు రాక అభివృద్ధి రెండేళ్లుగా ఆగిపోయిందని తెలిపారు.

Etela Rajendar

విధాత, హైదరాబాద్ : సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో బల్బులు పెట్టే వాళ్ళు లేరు.. మురికి కాలువలు శుభ్రం చేసేవారు లేరు అని తెలిపారు. ప్రజల అవసరాలను పట్టించుకునే నాధులే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ లో పర్యటించిన ఈటల మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరగకపోతే 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, పెర్ క్యాపిటా నిధులు రావని స్పష్టం చేశారు. ఆ నిధులు వస్తేనే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో రెండేళ్లుగా గ్రామాల అభివృద్ధి కుంటు పడిందని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదని, గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ప్రజలు ఎన్నుకుంటారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించడానికి బీజేపీ నాయకుడిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పారు. పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని ఛానెల్స్, యూ ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News