VIPS Group scam| అధిక లాభాల మోసగాళ్లు…విప్స్ ఏజెంట్ల అరెస్టు

పెట్టుబడిదారులను వందల కోట్లు మోసగించిన కేసు పెండింగ్ లో ఉండగానే.. మరోసారి “WAVE” పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూసిన విప్స్ కంపెనీ ప్రయత్నాలను నల్లగొండ రూరల్ పోలీసులు భగ్నం చేశారు. VIPS కంపెనీ ఏజెంట్లను అరెస్టు చేసి వారి మోసాలకు చెక్ పెట్టారు. అయితే విప్స్ అధినేత వినోద్ తుకారాం ఖుటేను ఎప్పుడు అరెస్టు చేస్తారు..? అతడు కొల్లగొట్టిన వందల కోట్లు ప్రజలకు ఎలా ఇప్పిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.

విధాత, హైదరాబాద్ : ఆధిక లాభాలు, కాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మిoచి మోసం చేసిన కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి, పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విప్స్ గ్రూప్ సంస్థ( VIPS group of companies) ఏజెంట్లపై ఎట్టకేలకు నల్లగొండ పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. గతంలోనే పెట్టుబడిదారులను వందల కోట్ల మోసగించిన కేసు పెండింగ్ లో ఉండగానే.. మరోసారి “WAVE” పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూసిన ఏజెంట్ల ప్రయత్నాలను నల్లగొండ రూరల్ పోలీసులు భగ్నం చేసి VIPS కంపెనీ ఏజెంట్లను అరెస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ విప్స్ మోసాల కేసు..నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు.

కేసు వివరాలు

2016 సంవత్సరంలో పుణె నగరo, మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన “వినోద్ తుకారాం ఖుటే” అనే వ్యక్తి VIPS Virtual Intelligence Payment System (VIPS) అనే వాలెట్ యాప్ ను ప్రారంభించాడు. 2018లో ఈ సంస్థను VIPS Group of Companies గా మార్చి, వివిధ రకాల సేవల పేర్లతో ఆధిక లాభాలు & కాష్ బ్యాక్ ఆఫర్ అంటూ ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రచారం చేసి, తన ఏజెంట్లు, ఎగ్జిక్యూటివ్, సీనియర్-ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, డెవెలప్ మెంట్ డైరెక్టర్ ల ద్వారా దేశ వ్యాప్తంగా వందల కోట్లల పెట్టుబడులు సేకరించాడు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన వారికి వడ్డీ డబ్బులు, అసలు తిరిగి ఇవ్వకుండా వినోద్ తుకారాం ఖుటే దుబాయ్ పారిపోయి ప్రజలను నమ్మిoచి మోసం చేశారు.

విప్స్ మోసాలు..బహు రూపాలు

ముందుగా Prime membership పేరుతో సభ్యత్వ రుసుము రూ.1,995/- వసూలు చేసి, వారికి రూ.2,000 షాపింగ్ పాయింట్లు, మొత్తం నగదు తిరిగి వచ్చే వరకు రోజుకు రూ.7 రాబడి ఇస్తామని హామీలతో పెట్టుబడులు సమీకరించారు. చెప్పిన మేరకు పెట్టుబడిదారులకు విప్స్ డబ్బులు ఇవ్వలేదు.

ఇక Referral Commission (కమిషన్ వ్యవస్థ) పేరుతో ఒక్కోక్కరి కింద ముగ్గురు సభ్యులను చైన్ సిస్టమ్ లో 5 స్థాయిల వరకు చేర్పిస్తే..మల్టీ-లెవల్ కమిషన్ (1లెవల్-20%, 2లెవల్ – 5%, 3లెవల్ – 2.5%, 4లెవల్ – 1.25%, 5 లెవల్ – 1.25% ) వస్తుందని డబ్బులు వసూలు చేశారు. ఇందులో కూడా చెప్పినట్లులగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు.

VIPS ట్రేడింగ్ పేరుతో రూ.10,000/- లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయమని ప్రేరేపించి, నెలకు 3% -5 % రాబడి ఇస్తామని హామీ ఇచ్చి, అధిక మొత్తంలో వందల కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు, వారికి ఇస్తామన్న వడ్డీ, అసలు ఇవ్వకుండా మోసం చేశారు.

VIPS ప్రాపర్టీస్ పేరుతో, తమ కంపెనీ చెప్పిన స్థలాలను కొనుగోలు చేస్తే, 100 నెలలలో “100% క్యాష్‌బ్యాక్” ఇస్తామని భరోసా ఇచ్చి స్థలాలను కొనిపించి, వారికి డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అలాగే MARCHANT మర్చంట్ & QR వ్యవస్థ పేరుతో దుకాణాలను QR కోడ్‌తో నమోదు చేసి, క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ, దుకాణ యజమాని , కస్టమర్ మధ్య పంచుకునే విధానం డబ్బులు వసూల్ చేసి కూడా తిరిగి ఇవ్వలేదు.

వందల కోట్ల సమీకరణ..ఎగవేత

పలు విధాల మనీ బ్యాక్ మోసాలతో VIPS group of companies అధినేత వినోద్ తుకారాం ఖుటే & అతని ఏజెంట్లు అందరూ కలిసి కుట్ర పన్ని వివిధ పథకాల పేరుతో డబ్బు సర్క్యులేషన్/పిరమిడ్ స్కీమ్‌ గా సృష్టించి, కొత్త సభ్యుల చేర్పుపై లాభాలు ఉంటాయి అని మాయమాటలు చెప్పి దేశ వ్యాప్తంగా వందల కోట్లు వసూలు చేశారు. నల్లగొండ కేంద్రంగా విప్స్ కార్యాలయం తెరిచి డైరక్టర్లను, ఏజెంట్లను నియమించి భారీగా పెట్టబడులు సేకరించారు. డిపాజిట్లు పెట్టిన సభ్యులను విదేశీ టూర్లు తీసుకెలుతామని, కార్లు, బైక్ లు, విల్లాలు కొనిస్తామని నమ్మించారు. ఏడాదిలో కోటిశ్వరులను చేస్తామని నమ్మబలికారు. ఇల ఉమ్మడి నల్లగొండ, తెలంగాణ జిల్లాల పరిధిలోనే విప్స్ ఇలా రూ.350కోట్లకు పైగా కొల్లగొట్టింది. కానీ ఆ డబ్బులతో ఎలాంటి వ్యాపార కార్యకాలాపాలు సాగించకపోగా..అసాధ్యమైన అధిక మనీ బ్యాక్ హామీల పేరుతో ప్రజలను నమ్మిoచి మోసం చేసింది. పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఇస్తామన్న వడ్డీ, అసలు 2023 నుంచే ఎగవేశారు. సంస్థ అధినేత వినోద్ ఖుటే దుబాయ్ పారిపోయాడు.

పాత డబ్బులు ఇస్తామంటూ మరో మోసం

తమ డబ్బులు తిరిగి ఇచ్చివేయాలని డిపాజిటర్లు ఒత్తిడి చేయగా..పాత డబ్బులు ఇవ్వాలంటే కొత్తగా లక్ష పెడితే 4లక్షలు కలిపి వడ్డీతో పాటు ఇస్తామని మళ్లీ మరో మోసానికి పాల్పడ్డారు. ఈ ఆఫర్ కు పడిపోయిన వారికి రెండు నెలలు వడ్డీ ఇచ్చి మళ్లీ అసలుతో సహా ఎగవేశారు.  రెండేళ్లకు పైగా విప్స్  యాప్‌ ద్వారా ఎలాంటి లావాదేవీలు లేక పోవడంతో దుబాయిలో ఉన్న విప్స్‌ అధినేత వినోద్‌ ఖుటేను  జిల్లాకు చెందిన ఏజెంట్లు పలుమార్లు కలిసినా ఎలాంటి ప్రయోజన లేక పోవడంతో బాధితులు  పోలీసులను ఆశ్రయించారు. దీనిపై 2025ఏప్రిల్ 14న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో 15మంది విప్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. విచిత్రం ఏమిటంటే విప్స్ బాధితుల్లో పోలీసు శాఖకు చెందిన ఉద్యోగులే రూ.50కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.స్థానికంగా న్యాయం దక్కదన్న ఆందోళనతో బాధితులు చివరకు హైదరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ లో సైతం ఫిర్యాదు చేశారు.

మళ్లీ కొత్త మోసం

తాజాగా నల్గొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్ వద్ద విప్స్ డైరక్టర్లు, ఏజెంట్లు ఓ సమావేశం ఏర్పాటు చేసి “WAVE” అనే కొత్త కంపెనీలో పాత కస్టమర్లు మళ్లీ రూ.1,00,000 పెట్టుబడి పెడితే, పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పి మళ్లీ మోసం చేయాలని యత్నించారు. ఈ సమాచారం అందుకున్న నల్గొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులపై క్రైమ్ నెంబర్: 64/2025 ద్వారా సెక్షన్లు: U/s 120(B), 409, 420 r/w 34 IPC & Sec 3 & 4 Prize Chits and Money Circulation Scheme (Banning) Act & Sec 5 of Protection of Depositor Financial Establishment Act 1999 కింద కేసు నమోదు చేశారు.

అరెస్టయిన విప్స్ నిందితులు

1) కానాల లక్ష్మినారాయణ రావు – వనస్థలిపురం, హైదరాబాద్.
2) పున్నం బాలకృష్ణ – మర్రూర్ గ్రామం, నకిరేకల్ మండలం.
3) ఉయ్యాల శ్రీనివాస్ – ఏలికట్టే గ్రామం, చిట్యాల మండలం.
4) కురాకుల రమేష్ – నల్గొండ పట్టణం.
5) గాజుల మహేష్ – దోరేపల్లి గ్రామం, కనగల్ మండలం.
6)కోల కుశలయ్య – కాకుల కొండారం గ్రామం, నల్గొండ మండలం.
7) మాదగొని సైదులు – శ్రీరామ్ నగర్ కాలనీ, నల్గొండ పట్టణం.
8)ముడుసు ఉమా శంకర్ – మునుకుంట్ల గ్రామం, కట్టంగూర్ మండలం.
9)ఓరుగంటి శంకర్ – అప్పాజీపేట గ్రామం, నల్గొండ మండలం.
10)గుడపూరి లింగస్వామి @ గూడూరు అఖిల్ – కట్టంగూర్ మండలం.

పరారీలో ఉన్న ప్రధాన నిందితులు:

1) వినోద్ తుకారాం ఖుటే – CEO, VIPS Group of Companies
2) సుమిత్ పురాంక్ – డైరెక్టర్
3) కల్యాణ్ చక్రవర్తి – సౌత్ ఇండియా డెవలప్మెంట్ డైరెక్టర్
4) గుమ్మల సత్యనారాయణ – డైరెక్టర్
5) గుమ్ముల అభినాష్– డైరెక్టర్,

 


అధిక లాభలో ఉచ్చులో పడి మోసపోవద్దు : ఏఎస్పీ

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ పెట్టుకోవద్దు –ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలకు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ రమేశ్ తెలిపారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా “తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు”, “పెట్టిన డబ్బు రెట్టింపు”, “రోజుకు భారీ ఆదాయం” వంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ మోసగాళ్లు మొదట చిన్న మొత్తంలో లాభాలు చూపించి నమ్మకం కలిగించి, తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తారు. డబ్బు పంపించిన తర్వాత వారు సంప్రదింపులు నిలిపివేయడం లేదా ఖాతాలను మూసివేయడం జరుగుతోందని వివరించారు. అందుకే ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, యువత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరైనా ఇలాంటి మోసలకు పాల్పడితే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్‌ను తెలియజేయాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ II టౌన్ సీఐ వి. రాఘవ రావు, నల్గొండ రూరల్ ఎస్‌ఐ సైదా బాబు,వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Latest News