ఏటీఎంలకు చేరాల్సిన రూ.1.20కోట్లు మాయం !

ఏటీఎంలలో నింపేందుకు తరలించిన నగదు నుంచి రూ.1.20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విధాత,హైదరాబాద్ : ఏటీఎంలలో పెట్టాల్సిన నగదు భారీగా మాయమైంది. హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఏటీఎంలలో నింపేందుకు తరలించిన నగదు నుంచి రూ.1.20 కోట్లకు పైగా డబ్బు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీఎంఎస్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతుంది. ఇటీవల సంస్థ ఆడిట్‌లో ఎస్సార్‌నగర్‌ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా.. 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో ఇద్దరు కస్టోడియన్లపై అనుమానం వ్యక్తమైంది. వారు విధులకు హాజరు కాకపోవడం.. ఫోన్ కాల్స్‌కూ స్పందించకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. సికింద్రాబాద్‌లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్‌ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

 

Latest News