అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం పరిపూర్ణం: నిర్మాణ కమిటీ ప్రకటన

అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. సుమారు రూ.1,800 కోట్ల వ్యయంతో చేపట్టిన బాలరాముడి ప్రధాన, అనుబంధ ఆలయాల పనులు ముగిసినట్లు మిశ్రా వెల్లడించారు.

విధాత : అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యిందని  శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ  ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. సుమారు రూ.1,800 కోట్ల వ్యయంతో చేపట్టిన బాలరాముడి ప్రధాన, అనుబంధ ఆలయాల పనులు ముగిసినట్లు మిశ్రా వెల్లడించారు. రామ్ లల్లా విగ్రహం ఉన్న తాత్కాలిక కట్టడంలో పవిత్ర జ్యోతిని వెలిగించారు. ఈనెల 14 నుంచి ఉప ఆలయాలను భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

ఆలయ నిర్మాణ బాధ్యతను తమకు 2020లో లాంఛనంగా అప్పగించినా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా ముందు నుంచే మొదలయ్యాయని తెలిపారు. న్యాయపరమైన చిక్కుముడులు తదితర కారణాల రీత్యా ఒక దశలో ఆశలు సన్నగిల్లినా దైవ నిర్ణయంతో నిర్మాణం పూర్తయిందని చెప్పారు. దీంతో రామభక్తుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. తొలుత రామ్‌ లల్లా విగ్రహాన్ని కలపతో చేసిన చట్రం వంటి తాత్కాలిక నిర్మాణంలో స్థాపించామని..ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సురక్షిత ప్రాంతంగా ప్రకటించి అందులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.

హిందువుల 500 ఏళ్ల కలను నెరవేర్చుతూ.. అయోధ్యలో దివ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఆలయ నిర్మాణలంలో ఇనుము, ఉక్కు వాడకుండా 5వ శతాబ్దపు నాగరా శైలిలో నిర్మించిన 3 అంతస్తుల రామమందిరం నిర్మాణం పూర్తి చేశారు. అయోధ్య బాల రామాలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగింది. 4 వేల మందికిపైగా కార్మికుల శ్రమతో నిర్మితమైన ఈ భవ్య రామ మందిరం.. 1000 ఏళ్ల వరకు ఎలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఎదురైనా తట్టుకుని నిలబడేలా నిర్మించారు.ఇక ఆలయ నిర్మాణం ప్రారంభించినపుడు విరాళాలను సేకరించగా.. ఏకంగా రూ.3 వేల కోట్లు సమకూరాయి.

ఆలయం నిర్మించే ప్రాంతం సరయూ నది నీటి జాడలు ఉండటంతో ఇంజనీర్లు చాల జాగ్రత్తలు తీసుకుని ఆలయ పునాదుల నిర్మాణ లోతును పెంచారు. ఆలయ పునాదిని 14 మీటర్ల లోతుకు తీశారు. అందులో 1.32 లక్షల క్యూబిక్ మీటర్ల రోలర్-కాంపాక్టెడ్ కాంక్రీట్‌తో నింపారు. దానిపైన స్థిరత్వం కోసం 1.5 మీటర్ల ఎత్తు గల అధిక-బలం కలిగిన రాఫ్ట్‌ను నిర్మించారు. దీనిపై తేమ, వరదల నుంచి ప్రధాన నిర్మాణాన్ని రక్షించడానికి.. సుమారు 24 వేల గ్రానైట్ రాళ్లతో తయారు చేయబడిన 6.5 మీటర్ల ఎత్తైన ప్లింత్ నిర్మించారు.

మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు.. 235 అడుగుల వెడల్పు.. 360 అడుగుల పొడవుతో నిర్మించారు. గర్భగుడితో పాటు.. ఆలయ ప్రధాన సముదాయంలో వివిధ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల కోసం 5 మండపాలు ఏర్పాటు చేశారు.

ఆలయ గ్రౌండ్ ఫ్లోర్‌లో దేవతల విగ్రహల చెక్కడాలతో కూడిన సుమారు 160 స్తంభాలు ఉంటాయి. ఇక్కడే గర్భగుడిలో మైసూర్ నల్ల గ్రానైట్‌తో చెక్కబడిన బాల రూపంలో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 47 తలుపుల్లో 14 బంగారు పూత పూసినవి ఉన్నాయి. ఇక పైన మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఉంటుంది. ఇక్కడ రాజు రూపంలో రాముడు ఉంటాడు. సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను రాజస్థాన్ నుంచి తెచ్చిన తెల్ల మక్రానా పాలరాతితో చెక్కారు. ఈ అంతస్తులో మొత్తం 132 స్తంభాలు ఉన్నాయి.

మొత్తం రామాలయ ప్రాంగణం 70 ఎకరాలు ఉంది. అందులో 20 ఎకరాల్లో ప్రధాన ఆలయం నిర్మాణం చేశారు. మరో 50 ఎకరాలు ఖాళీగా ఉండగా.. 30 ఎకరాలు గ్రీన్ బెల్ట్‌కు కేటాయించారు. ప్రధాన ఆలయ సముదాయం వెలుపల దాదాపు 750 మీటర్ల పొడవు.. 14 అడుగుల మందంతో రెండు అంతస్తుల బయటి గోడ ఉంది. కింది అంతస్తులో సూర్యుడు, శివుడు, భగవతి, గణేశుడు, హనుమాన్, మాతా అన్నపూర్ణ ఆలయాలు ఉంటాయి. పై అంతస్తు పెద్ద సంఖ్యలో భక్తుల ప్రదక్షిణ మార్గంగా ఏర్పాటు చేశారు.

Latest News