Hyderabad | పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు క్రూర మృగల్లా విరుచుకుపడ్డారు. మాయమాటలు చెప్పి ఆ విద్యార్థినిని లొంగదీసుకున్నారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనను వీడియో తీసి బెదిరింపులకు గురి చేశారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే ఈ వీడియోను బయటపెడుతామని హెచ్చరించారు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హయత్‌నగర్ పరిధిలోని తట్టి అన్నారంలో ఈ ఏడాది ఆగస్టులో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇటీవలే ఈ వీడియోను తోటి విద్యార్థులకు షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.