Site icon vidhaatha

Madurai | రైలులోకి గ్యాస్ సిలిండ‌ర్‌.. స్టౌపై కాఫీ చేస్తుండ‌గా పేలుడు : 10 మంది దుర్మ‌ర‌ణం

Madurai | విధాత‌: త‌మిళ‌నాడు మ‌రో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. బోగిలోకి అక్ర‌మంగా గ్యాస్ సిలిండ‌ర్ తీసుకొచ్చిన ఓ వ్య‌క్తి దానిపై వంట‌ చేస్తుండ‌గా పేలిపోవ‌డంతో ప‌ది మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 20 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. మ‌దురై శ‌నివారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. మృతదేహాలను మధురైలోని ప్రభుత్వ రాజాజీ దవాఖాన‌కు త‌ర‌లించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శ‌నివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో మదురై రైల్వే స్టేషన్‌లో ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన యాత్రికులు ఉన్నారు. కాఫీ చేయడానికి గ్యాస్ స్టవ్ వెలిగించగా, గ్యాస్ సిలిండర్ పేలింది. 10 మృతదేహాలను వెలికితీశాము అని మదురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత తెలిపారు.

ఈ ప్రైవేటు పార్టీ కోచ్ యూపీలోని ల‌ఖ్‌న‌వూ నుంచి ఈ నెల 17న బ‌య‌లుదేరింది. శుక్ర‌వారం నాగర్‌కోయిల్ జంక్షన్ వద్ద రైలు నెం. 16730 (పునలూర్-మదురై ఎక్స్‌ప్రెస్)లో పార్టీ కోచ్‌ని వేరు చేసి మదురై స్టాబ్లింగ్ లైన్‌లో ఉంచారు. ప్రైవేట్ పార్టీ కోచ్‌లోని ప్రయాణికులు గ్యాస్ సిలిండర్‌ను అక్రమంగా బోగీకి తీసుకొచ్చారు. వంట చేస్తుండ‌గా. ఒక్క‌సారిగా పేలిపోయింది.

ఆ స‌మయంలో బోగీలో 65 మంది ఉన్నారు. మంట‌లు గ‌మ‌నించి చాలా మంది ప్రయాణికులు బయటకు దూకారు. కొంతమంది ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పై దిగారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా ఉన్న వస్తువులలో సిలిండర్, ఆలుగ‌డ్డ‌ల సంచులు ఉన్నాయి. అగ్ని మాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రైల్వే మంత్రిత్వ‌శాఖ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తంచేసింది. మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించింది.

Exit mobile version