Sridevi | ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీదేవి (Sridevi) పేరు ఒక ఎమోషన్. ‘అతిలోక సుందరి’గా కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆమె, ఐదు దశాబ్దాల పాటు సినీ ప్రపంచాన్ని ఏలింది. ఆమె నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే కెమెరా ముందు మెరిసిన ఈ స్టార్ వెనుక, చాలామందికి తెలియని ఆసక్తికరమైన నిజాలు, సంచలన ఘట్టాలు కూడా ఉన్నాయి. 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. చాలా చిన్న వయసులోనే ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. కేవలం నాలుగేళ్ల వయసులోనే ‘తునైవన్’ అనే తమిళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసి, ఆ తర్వాత దశాబ్దాల పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది.
సౌత్ నుంచి బాలీవుడ్‌కి అడుగుపెట్టిన తొలి రోజుల్లో శ్రీదేవికి హిందీ భాష పెద్ద సవాలే. హిందీ మాట్లాడటం రాకపోవడంతో ఆమె నటించిన అనేక సినిమాలకు నటి నాజ్ డబ్బింగ్ చెప్పేది. అయితే 1989లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘చాందిని’తో శ్రీదేవి స్వయంగా డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె హిందీతో పాటు ఇతర భాషల్లోనూ నెమ్మదిగా ప్రావీణ్యం సంపాదించింది.శ్రీదేవి కెరీర్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం హాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేయడం. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన ‘జురాసిక్ పార్క్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినా, పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో పాటు బాలీవుడ్‌ను వదిలి వెళ్లలేక ఆమె ఆ ఆఫర్‌కు నో చెప్పింది. అలాగే ‘బాజీగర్’, ‘బేటా’ వంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాలను కూడా ఆమె వదులుకున్న సంగతి తెలిసిందే. ఇదే కాక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’లో శివగామి పాత్రను కూడా ఆమె చేయలేదు.
తెలుగు చిత్రసీమలో కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ ఒక సంచలనం. 1979 నుంచి 1987 మధ్య వీరిద్దరూ కలిసి ఏకంగా 29 సినిమాల్లో నటించారు. ఒక్క 1982లోనే ఈ జంట కాంబినేషన్‌లో 8 సినిమాలు విడుదల కావడం అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఎన్టీఆర్, చిరంజీవితో కలిసి కూడా శ్రీదేవి ఎన్నో బ్లాక్‌బస్టర్లు అందుకుంది. రెమ్యునరేషన్ విషయంలోనూ శ్రీదేవి సరికొత్త రికార్డులు సృష్టించింది. 1985 నుంచి 1992 మధ్య కాలంలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది. ఆ సమయంలో జయప్రదతో తీవ్ర పోటీ నడిచినా, ‘నాగిని’ వంటి సూపర్ హిట్‌తో ఆమె టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.
ఒక ప్రత్యేక సందర్భంలో శ్రీదేవి పాత్రకు సీనియర్ హీరోయిన్ రేఖ డబ్బింగ్ చెప్పడం కూడా విశేషమే. ‘ఆఖ్రీ రాస్తా’ సినిమాలో శ్రీదేవి పాత్రకు రేఖ స్వయంగా వాయిస్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.వ్యక్తిగత జీవితంలోనూ శ్రీదేవి చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. బోనీ కపూర్‌తో ఆమె రిలేషన్, అప్పటికే ఆయనకు మోనా కపూర్‌తో వివాహం జరిగి ఉండటం, శ్రీదేవి గర్భవతి కావడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. జాన్వీ కపూర్ గర్భంలో ఉన్న సమయంలో జరిగిన ఓ న్యూ ఇయర్ పార్టీలో తీవ్ర గొడవ జరిగిందని, ఆ ఘటన అప్పట్లో సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
బోనీ కపూర్‌తో పెళ్లికి ముందు శ్రీదేవి తల్లి, తమ కుటుంబ స్నేహితుడైన డాక్టర్ రాజశేఖర్‌తో (హీరో రాజశేఖర్) ఆమెకు పెళ్లి చేయాలని అనుకున్నారనే కథనాలు కూడా ఉన్నాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2018 ఫిబ్రవరి 25న దుబాయ్‌లో ఓ కుటుంబ వివాహానికి వెళ్లిన శ్రీదేవి అనూహ్యంగా బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందడం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. డిన్నర్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి ప్రమాదం జరిగిందని, శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని అధికారిక నివేదికలు వెల్లడించాయి. కేవలం 54 ఏళ్లకే ఈ లెజెండరీ నటి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఇండియన్ సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. శ్రీదేవి ఇక లేరు.. కానీ ఆమె నటన, గ్లామర్, వ్యక్తిత్వం మాత్రం తరతరాల అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
