ORR
- రూ.1000 కోట్లు చేతులు మారాయి
- దేశంలోనే పెద్ద కుంబ కోణం
- దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం
- మీడియా సమావేశంలో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత: రూ. 30 వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్‌ను కేవలం రూ.7380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ లీజు వ్యవహారంలో రూ.1000 కోట్లు చేతులు మారాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ను 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడాన్ని దేశంలోనే అతిపెద్ద కుంబకోణంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఓఆర్ ఆర్‌కు మొదట్లో లీజు ద్వారా 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ఆ తర్వాత 8-9 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు రూ.7380 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ వ్యవహారంలో దాగి ఉన్న మతలబు ఏమిటని రేవంత్ ప్రశ్నించారు.
సోమేశ్ కుమార్ కనుసన్నుల్లో లీజు వ్యవహారం..
ఈ లీజు వ్యవహారం అంతా సోమేశ్ కుమార్ కనుసన్నుల్లో జరిగిందని, అరవింద్ కుమార్ కేవలం సంతకం మాత్రమే పెట్టారన్నారు. ప్రభుత్వం దిగిపోయే ఆరు నెలల ముందు తీసుకున్న ఏ నిర్ణయాలనైనా వచ్చే ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు. కేటీఆర్, సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ వ్యవహారంలో దోపీడికి పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని, ఈ నిర్ణయాన్ని లోతుగా పరిశీలిస్తున్నామన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారణ జరిపిస్తామని రేవంత్ తెలిపారు. ఈ అంశంలో యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ లు తీసుకున నిర్ణయాలన్నింటిని కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందన్నారు.
రోజుకు 2 కోట్ల టోల్ వసూలు..
2018 నుంచి ఓఆర్ఆర్ టోల్ ను ఏయే సంస్థలు వసూలు చేశాయో, వాటికి టెండర్ రూపంలో లేదా నామినేషన్ రూపంలో కట్టబెట్టారో అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత నాలుగు సంవత్సరాల నుంచి ఓఆర్ఆర్ టోల్ ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారన్నారు. ఓఆర్ఆర్ రోజుకు 2 కోట్ల టోల్ వసూలు అవుతుందని, టెండర్ అవసరం లేకుండానే ఏడాదికి ఏడాది పొడిగించుకుంటూ వెళ్లారని, ఇందులో కేటీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్ ను ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం ఉపయోగించుకుందన్నారు. తమ కుటుంబానికి లాభం ఉండదని గ్రహించి టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT) విధానంలో 30 సంవత్సరాలు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ మౌనానికి కారణమేమి?
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ నేతలు కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.
2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మించిందని, ఇందు కోసం రూ. 6696 కోట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నేడు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారంటే, విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ లే ప్రామాణికం అని అన్నారు.
టోల్ ఛార్జీలు పెంచుకునే హక్కు కూడా వారికే…
ఓఆర్ఆర్ ను లీజుకు ఇవ్వాలన్న నిర్ణయంతో ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ను వినియోగించుకోలేని పరిస్థితులు దాపురించాయని రేవంత్ అవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే టోల్ ఛార్జీలు పెంచుకునే వెసులుబాటుకు కూడా టోల్ సంస్థకు కట్టబెట్టారన్నారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, కానీ ఉన్నవాటిని ఆమ్మేసి దాన్నే పెట్టుబడిగా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటుందన్నారు.
టెండర్ విధానాలపై ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ సహా విచారణ సంస్థలన్నింటికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వాస్తవంగా ఇంతకు ముందు ఓ ఆర్‌ఆర్ టోల్ వసూల్‌ను ఆదానికి కట్టబెట్టాలని చూశారన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో టోల్‌వసూల్‌ను ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.