Site icon vidhaatha

Odisha | ఒడిశాలో ఘోర ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీకొని 12 మంది మృతి

Odisha | ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 12 మంది మృతి చెందారు. మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఒడిశా రాష్ట్ర ర‌వాణా సంస్థ‌కు చెందిన బ‌స్సు గుడారి నుంచి రాయ‌గ‌డ జిల్లాకు బ‌య‌ల్దేరింది. ఇదే మార్గంలో బెర్హంపూర్ నుంచి వ‌స్తున్న ప్ర‌యివేటు బ‌స్సు.. ఎదురుగా వ‌స్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఘ‌ట‌నాస్థ‌లంలోనే 12 మంది ప్ర‌యాణికులు కోల్పోయారు. మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న ఆదివారం రాత్రి ఒంటి గంట‌కు చోటు చేసుకుంది.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై బెర్హంపూర్ ఎస్పీ శ‌ర‌వ‌ణ వివేక్ మీడియాతో మాట్లాడారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించామ‌ని తెలిపారు. స్థానిక పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌మాదానికి అతి వేగ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌న్నారు.

ప్ర‌యివేటు బ‌స్సులో ఉన్న‌వారే మ‌ర‌ణించార‌ని పేర్కొన్నారు. ఈ బ‌స్సు బెర్హంపూర్‌లో ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రై తిరిగి వస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. ఒక డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయ‌ని, చికిత్స పొందుతున్నాడ‌ని పేర్కొన్నారు. మ‌రో డ్రైవ‌ర్ ఆచూకీ లేద‌ని తెలిపారు.

సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ రోడ్డుప్ర‌మాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఒక్కో కుటుంబానికి రూ. 3 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు ఉచితంగా వైద్యం అందిస్తామ‌న్నారు.

Exit mobile version