Site icon vidhaatha

దేశంలోకి మ‌రో 12 చిరుత‌లు

-ద‌క్షిణాఫ్రికా నుంచి విమానంలో వ‌చ్చిన సెకండ్ బ్యాచ్‌

విధాత‌: దేశంలోకి మ‌రో 12 చిరుత పులులు వ‌చ్చాయి. భార‌త్‌లో అంత‌రించిపోయిన చిరుత‌ల జాతిని తిరిగి పెంచాల‌న్న ల‌క్ష్యంతో విదేశాల నుంచి చిరుత పులుల‌ను తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాఫ్రికా నుంచి విమానంలో సెకండ్ బ్యాచ్‌ చిరుత‌లు ల్యాండ‌య్యాయి.

భార‌త వైమానిక ద‌ళానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్ట‌ర్ కార్గో ప్లేన్ ద్వారా ద‌క్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బ‌ర్గ్ నుంచి ఈ చిరుత పులుల‌ను తీసుకువ‌చ్చారు. 10 గంట‌లు ప్ర‌యాణించి శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లోగ‌ల‌ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌లో ఈ విమానం దిగింది.

అక్క‌డి నుంచి ఎంఐ-17 హెలీక్యాప్ట‌ర్ల‌లో తెచ్చి స్థానిక కునో జాతీయ పార్కులో ఈ చిరుత‌ల‌ను విడిచిపెట్టారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లోనూ తొలి బ్యాచ్‌లో 8 చిరుత‌లు న‌మీబియా నుంచి భార‌త్‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

తాజా బ్యాచ్‌తో కునో పార్కులో చిరుత‌ల సంఖ్య 20కి చేరింది. చిరుత‌ల కోసం భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఎంవోయూ కుదిరిన విష‌యం తెలిసిందే. చిరుత‌ల రాక‌ప‌ట్ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం చౌహాన్ ఆనందం వ్య‌క్తం చేశారు.

Exit mobile version